Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాండ్విక్ యూనియన్ మాజీ అధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్
- కార్మిక సంక్షేమం కోసం అనునిత్యం కృషి
- యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
- శాండ్విక్ పరిశ్రమలో ఘనంగా యూనియన్ 39వ వ్యవస్థాపక దినోత్సవం
నవతెలంగాణ-పటాన్చెరు
కార్మికవర్గ ఐక్యతతోనే పాలకుల విధానాలను తిప్పి కొట్టగలమని శాండ్విక్ యూనియన్ మాజీ అధ్యక్షులు, నవతెలంగాణ పత్రిక సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో ఆదివారం జరిగిన కంపెనీ ఎంప్లాయీస్ యూనియన్ 39వ వ్యవస్థాపక దినోత్సవంలో యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుతో కలిసి సుధా భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సుధా భాస్కర్ మాట్లాడుతూ.. 1985 ఏప్రిల్ 9న సీఐటీయూకి అనుబంధంగా స్థాపించిన శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ (అప్పటి విడియా ఎంప్లాయీస్ యూనియన్) కార్మికులను ఐక్యంగా ఉంచడానికి సిద్ధాంత ప్రాముఖ్యత ప్రధాన కారణమన్నారు. అమెరికా నాటో విస్తరణ స్వార్ధం మూలకంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత అతలాకుతలం చేసిందన్నారు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులు కార్మికవర్గాన్ని మరింత దోపిడీ చేయడానికి ఉపయోగ పడుతున్నదని ఆరోపించారు. కార్మికవర్గ ఐక్యత ద్వారా వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
చుక్క రాములు మాట్లాడుతూ.. ఎన్ని యాజమాన్యాలు మారినా ఐక్యతను కాపాడుకుంటూ కార్మిక సంక్షేమానికి అనునిత్యం కృషిచేస్తూ 39 ఏండ్లుగా యూనియన్ను కాపాడుకుంటూ వచ్చామన్నారు. మన బేరసారాల శక్తి తగ్గిపోకుండా కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యమన్నారు. గరిష్టస్థాయిలో కార్మికుల సంఘటిత శక్తిని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత ఆఫీస్ బేరర్స్ కమిటీ సభ్యులను సత్కరించారు. అనంతరం నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.పాండురంగా రెడ్డి, ఎమ్.మనోహర్, ఎ.వీరారావు, హెచ్. వెంకట్రావు, వి. సదాశివరెడ్డి, ఎస్.త్రిలోచన్ కుమార్, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.