Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- రాష్ట్రంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 4 వేల మంది మరణం
నవతెలంగాణ-సిద్దిపేట
సీపీఆర్ నేర్చుకుంటే 50శాతం మందిని బతికించొచ్చనీ, కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను సీపీఆర్ విధానంతో తిరిగి స్పృహలోకి తీసుకురావొచ్చని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశ వ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉన్నదనీ, కాబట్టి అందరం సీపీఆర్ నేర్చుకుని ప్రతి ప్రాణాన్ని కాపాడదామని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మంత్రి సమక్షంలో స్వయంగా సీపీఆర్ చేసి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సడెన్ కార్డియాక్ అరెస్టుతో దేశంలో 15 లక్షల మంది, రాష్ట్రంలో 4 వేల మంది చనిపోతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా రెండు శాతం మందికి మాత్రమే సీపీఆర్‌పై అవగాహనా ఉందని, కాబట్టి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీపీఆర్ శిక్షణా కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. హార్ట్ఎటాక్, సడెన్ కార్డియాక్ అరెస్ట్ వేర్వేరుగా ఉంటాయని, కార్డియాక్ అరెస్ట్ అనేది శ్వాస ఆడకపోవడం, పల్స్ లేకపోవడంగా ఉంటుందన్నారు. రూ.15 కోట్లతో ఏఈడీ మిషన్లు ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తామని, మున్సిపల్ చట్టాల్లో సవరణ చేసి, అపార్టుమెంట్లకు అనుమతులు ఇచ్చినప్పుడు ఏఈడీ మిషన్లు ఏర్పాటు చేయాలని చెబుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణలో ప్రతి బ్యాచ్‌లో 20 మంది చొప్పున 1826 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేశామని, మొత్తం 36,500 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సిద్ధిపేట జిల్లా తరహాలోనే పోలీస్ హెల్త్ ప్రొఫైల్ మిగతా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామన్నారు. ఇటీవల సీపీఆర్ చేసి విలువైన ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, గిడ్డంగి కార్పొరేషన్ చైర్మెన్ సాయిచంద్, పోలీసు కమిషనర్ శ్వేత, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.