Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో కీలకపాత్ర పోషించిన నర్రా : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నిజమైన ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, అలాంటి నాయకుల్లో నర్రా రాఘవరెడ్డి ఒకరని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎంవీఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో నర్రా రాఘవరెడ్డి 8వ వర్థంతి సభ ఆ ట్రస్టు కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటితరం నర్రారాఘవరెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధి అంటే నర్రా రాఘవరెడ్డి లాగా నిబద్ధత కలిగి ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. నర్రాతో తనకు ప్రత్యక్ష అనుబంధం ఉందని, ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్‌లో ఒక ఉపాధ్యాయుడి బదిలీ విషయంలో జెడ్పీ సీఈఓతో మాట్లాడి పరిష్కరించారని గుర్తు చేశారు. తన జీవితమంతా పోరాటాలు, సమస్యలతో కూడుకున్నప్పటికీ నమ్ముకున్న ఆశయం కోసం కడదాకా నిలబడ్డారని తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో, ఎస్ఎల్బీసీ సొరంగం కోసం సాగిన పోరాటంలో నర్రా ప్రముఖులని కొనియాడారు. చట్టసభల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చలు లాగా ఆరోజుల్లో లేవని, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్భయంగా ఆ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాఘవరెడ్డి కోరారని తెలిపారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ విముక్తి చేయాలనే తపనతోనే ఎస్ఎల్బీసీ సొరంగం అయితే ఆలస్యం అవుతుందని నార్ల తాతారావు వెంటబెట్టుకుని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. ఏ విషయాన్నైనా కులంకుషంగా చర్చించి పరిష్కరించే వారిని, ప్రజా సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించిన మహనీయుడని కొనియాడారు. అమరజీవి పేరుతో షుగర్, బీపీ, ఫిట్స్, పక్షవాతం రోగులకు మందులు ఇస్తున్నామని చెప్పారు. తమ సంస్థ చేపట్టే కార్యకలాపాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఎంవీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్‌హాషం, ఎండీ.సలీం, పి.నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, సైదులు, సత్యనారాయణ, రవి, కంప్యూటర్ ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.