Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలిసికట్టుగా ముందుకు సాగుదాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఎర్రగడ్డ ఇది.. ఈ గడ్డపై కాషాయ జెండాను ఎగరనివ్వమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 'నీ బాంచన్ దొర.. నీ కాల్మొక్తా..' అన్న తెలంగాణ పేదవానికి ధైర్యం చెప్పి.. తెలివి నేర్పి.. బందుకూ చేత పట్టించి 4వేల మంది కమ్యూని స్టులు రక్తతర్పణం గావించి, పదిలక్షల ఎకరాల భూమి పంచి.. నిజాంను గడగడలాడించి గద్దెదిం చిన చరిత్ర ఈ గడ్డదని గుర్తుచేశారు. అభ్యుదయ, ప్రగతిశీల భావజాలం ఉన్న ఇలాంటి గడ్డపై కాషాయ భావజాలానికి అవకాశమివ్వకూడదని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవరసముందన్నారు. కమ్యూనిస్టులకు సీట్లు ఉన్నాయా లేవా.. వారికి భవిష్యత్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదని, వారు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్ ఉందా..? అనేది ఆలోచించాలని సూచించారు. భారతదేశానికి స్వాతంత్య్రం ప్రతిపాదించిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదు.. కమ్యూనిస్టులదేనన్నారు. సమస్త సంపదకు మూలమైన అన్నింటినీ కేంద్రప్రభుత్వం కార్పొరేట్ పరం చేస్తున్నదన్నారు. ఒకే దేశం, ఒకే టాక్స్, ఒకే భాష, ఒకే మతం అని చెప్పే మోడీ.. ఒకే కులం అని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ మళ్లీ రావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని తెలిపారు. ఏ కులం వాళ్లు ఆ కులవృత్తి చేసుకోవాలని చెప్పడమే బీజేపీ సిద్దాంతం అన్నారు. బీసీ ప్రధాని అంటున్నారు.. కానీ బీసీలకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో అన్ని పార్టీలు కుల గణన జరగాలని చెబుతున్నా బీజేపీ ఎందుకు చేయడం లేదన్నారు. కేంద్రీకరణ కాదు.. వికేంద్రీకరణ జరగాలని ప్రతిపాదించింది కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. కేసీఆర్, ఇతర ప్రాంతీయ పార్టీలు కలసి వస్తున్నారు అంటే వారి అవసరాల కోసం, రాష్ట్రాల హక్కుల కోసమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పోడు భూములకు పట్టాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. 11లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజలను కష్టాల పాలు చేసి.. కన్నీళ్లు తెప్పిస్తే బీఆర్ఎస్పై కూడా రానున్న రోజుల్లో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కమ్యూనిస్టులు భావజాలపరంగానే కాకుండా.. భౌతిక శక్తిగా ఎదగాలన్నారు. అందుకోసం కమ్యూనిస్టుల ఐక్యత కీలకమని, అప్పుడు ఎర్రజెండాకు ఎదురే ఉండదని స్పష్టం చేశారు.