Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు కేటాయింపులు కష్టమే!
- డిఫాల్టర్లు, అక్రమార్కులను గుర్తించే పనిలో టాస్క్‌ఫోర్స్
- వందశాతం సీఎంఆర్ ఇచ్చిన మిల్లులకు ప్రాధాన్యత
- మిగిలిన ధాన్యం బహిరంగ మార్కెట్లో అమ్మే ఆలోచనలు
- ఏటా నష్టాన్ని నియంత్రించేందుకు పలు కీలక నిర్ణయాలు
- సీఎం కేసీఆర్ వద్దకు చేరిన ప్రతిపాదనలు
- మరో పది రోజుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ షురూ!
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి (బి.శ్రీకాంత్)
ప్రతియేటా వానాకాలం, యాసంగి సీజన్లలో ఇబ్బడిముబ్బడిగా ధాన్యం దిగుబడి వస్తోంది. అయితే, ధాన్యం సీఎంఆర్ విషయంలో రాష్ట్ర సివిల్ సప్లరు శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. మిల్లర్లు మర ఆడించిన బియ్యం ఇవ్వకపోవడం.. గడువు దాటిందని కేంద్రం తీసుకోకపోవడంతో ఆ భారమంతా రాష్ట్ర సివిల్ సప్లరు సంస్థపైనే పడుతోంది. ప్రతి సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయించడం.. సకాలంలో సీఎంఆర్ రూపంలో బియ్యం తిరిగి ఇవ్వకపోవడం పరిపాటిగా మారింది. కేటాయించిన ధాన్యం కొందరు మిల్లర్లు అమ్ముకోవడం, మళ్లీ వచ్చిన సీజన్ ధాన్యం మర ఆడించి పాత లెక్కలు చూపడం, రేషన్ డీలర్లతోనే పీడీఎస్ బియ్యం కొని ఎఫ్‌సీఐకి అప్పగించడం వంటి అక్రమాలూ జరుగుతున్నాయి.. దీంతో ఈసారి ఆ నష్టాన్ని నియంత్రించేందుకు సివిల్ సప్లయ్ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. డిఫాల్టర్లు, అక్రమార్కులకు ధాన్యం కేటాయించకుండా.. మిగిలిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకే బయట అమ్మేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. రెండు రోజుల కిందట తయారు చేసి పంపిన పలు కీలక నిర్ణయాల నివేదిక సీఎం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు సివిల్ సప్లయ్ వర్గాల సమాచారం.
సివిల్ సప్లయ్ సంస్థకు నష్టాలు వస్తున్న కారణాల్లో మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడమే ప్రధాన అంశంగా ఉంది. ప్రతి సీజన్‌కు కొంత సీఎంఆర్ పెండింగ్ పెడుతున్న మిల్లులు.. ఆర్నెళ్లకోమారు వచ్చే ఖరీఫ్, రబీ ధాన్యం తీసుకుంటూ గందరగోళంగా బియ్యం అప్పగిస్తున్నాయి. పాత సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని తరువాతి సీజన్లో వచ్చే ధాన్యం మర ఆడించి ఇస్తున్న పరిస్థితి అక్కడక్కడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయినా పూర్తిస్థాయిలో సకాలంలో సీఎంఆర్ అప్పగించడంలో మిల్లులు చేస్తున్న జాప్యానికి ఎఫ్‌సీఐ నుంచి గడువు ముగిసిపోవడంతో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వంపైనే భారం పడుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కరీంనగర్ జిల్లా వరకు పరిశీలిస్తే 2021-22 వానాకాలం సీజన్లో ప్రభుత్వం సేకరించిన 3,95,863 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని 183 మిల్లులకు కేటాయిస్తే.. తిరిగి బియ్యం రూపంలో 2,65,228 మెట్రిక్‌టన్నుల బియ్యం రావాల్సి ఉంది. ఇందులో మిల్లులు 86.65శాతమే అప్పగించాయి. అందులోనూ వంద శాతం సీఎంఆర్ అప్పగించిన మిల్లులు 117 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 66 మిల్లులు 35,401మెట్రిక్‌టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. 2021-2022 యాసంగి సీజన్‌ను పరిశీలిస్తే.. ప్రభుత్వం 178 మిల్లులకు 3.07లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. తిరిగి 2.08లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యం రావాల్సి ఉండగా.. ఇంకా 38,519 మెట్రిక్‌టన్నుల (19శాతం) సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉంది. ఇందులో 70మిల్లులు వంద శాతం సీఎంఆర్ అప్పగించగా.. 108మిల్లుల్లో ఇంకా పెండింగ్ ఉండటం గమనార్హం. మొన్నటి వానాకాలం సీజన్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యంలో సీఎంఆర్ రూపంలో 12.21శాతమే వచ్చింది.
బయట మార్కెట్లో ధాన్యం అమ్ముకునే
ఆలోచనలో సివిల్ సప్లయ్
ప్రతి సీజన్లోనూ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడం, డిఫాల్టర్లు, అక్రమార్కుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ యాసంగి పంటపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొనుగోలు చేసిన ధాన్యంలో సగం ధాన్యం మిల్లులకు ఇవ్వకుండా గోదాములకు తరలించే ఆలోచనలో ఉంది. తద్వారా మిల్లర్లపై ఒత్తిడి తగ్గి సకాలంలో మిల్లింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉన్న మిల్లర్లకు అవసరమైతే మరికొంత ధాన్యాన్ని ఇవ్వనుంది. లేకపోతే ఎంఎస్పీ నష్టపోకుండా టెండర్ల ప్రక్రియ ద్వారా ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మే ఆలోచనలో ఉంది. మొత్తంగా ట్రాన్స్‌పోర్టు, మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ, ఎఫ్‌సీఐతో ఇబ్బందులు లేకుండా.. పౌరసరఫరాల శాఖ నష్టపోకుండా చర్యలు తీసుకునేందుకు పలు కీలక ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇప్పుడు వాటిని సీఎం కేసీఆర్ దగ్గర అనుమతి కోసం పంపించారు.