Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి బిల్లుల రగడ..
- మూడు బిల్లులకు తమిళిసై ఆమోదం
- రెండు రాష్ట్రపతి సమ్మతికి.. రెండు ప్రభుత్వానికి వాపస్
- మరో మూడు పెండింగ్..
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ వ్యవహారశైలితో మరోసారి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. గతంలో మాదిరిగా 'గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్...'లాగా పరిస్థితి తయారైంది. బిల్లుల విషయంలో తమిళి సై మొండి పట్టు పట్టగా... ఆమె రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్లో పాసై గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపిన 10 బిల్లుల్లో మూడింటికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతి సమ్మతి కోసం రాష్ట్రపతి భవన్‌కు పంపారు. మరో రెండింటిని తిరిగి ప్రభుత్వానికి పంపిన గవర్నర్..మూడు బిల్లులను తనవద్దే పెండింగ్‌లో ఉంచారు. ప్రభుత్వం పంపిన బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలేదని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం పంపిన బిల్లుల్లో తెలంగాణ మోటర్ వెహికిల్స్ ట్యాక్సేషన్ అమెండమెంట్ బిల్ 2022, మున్సిపాలిటీస్ అమెండమెంట్ బిల్ 2023, ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అమెండమెంట్ బిల్ 2023కు గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్ 2022, యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్ 2022లను రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్ రాష్ట్రపతి భవన్‌కు నివేదించారు. తెలంగాణ స్టేట్ ప్రయివేటు యూని వర్సిటీస్ అమెండమెంట్ బిల్ 2022, తెలంగాణ మున్సిపల్ లా అమెండ మెంట్ బిల్ 2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ అమెండమెంట్ బిల్ 2022పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పంచా యతీరాజ్ అమెండమెంట్ బిల్ 2023, ఆజామాబాద్ ఇండిస్టియల్ ఏరియా అమెండమెంట్ బిల్ 2022పై వివరణ కోరుతూ గవర్నర్ ఈ రెండు బిల్లులను ప్రభుత్వానికి వాపస్ పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
గవర్నర్ తీరుపై పిటిషన్ విచారణ వాయిదా
- దాఖలు చేసిన సర్కార్..రెండు వారాల తర్వాత పరిశీలన : సుప్రీం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన 10 బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేసే దిశలో గవర్నర్ తీరును తప్పుబడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 2న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహా, జస్టిస్ పార్ధివాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్బంగా సొలిసిటర్ జనరల్(ఎస్ జి) తుషార్ మెహతా వాదిస్తూ... గవర్నర్ కొన్ని బిల్లులు ఆమోదించారని, అందుకు సంబంధించిన వివరాలతో ఉన్న లేఖను పరిశీలించాలని కోరారు. గవర్నర్ బిల్లులను ఆమోదించవచ్చని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 9న గవర్నర్ కార్యాలయం ఒక రిపోర్ట్ కోర్టుకు అందిందనీ, అది సీజేఐ రికార్డు చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కొన్ని బిల్లుపై గవర్నర్ వివరణ కోరినట్టు వివరించారు. తాను గవర్నర్ తరపున అందుకున్న లేఖపై మాత్రమే వాదిస్తున్నాననీ, అయితే ఆ లేఖలో తనను ఉద్దేశించి ఉన్న అంశాన్ని తొలగించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ తరపు అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్) శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తోన్న సీనియర్ అడ్వకేట్ హాజరు కానుందున పాస్ అవుట్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఏవైనా అంశాలుంటే ప్రస్తావించాలని కోరారు. అసెంబ్లీ పాస్ చేసిన 10 బిల్లుల్లో పలు బిల్లులు 2022 సెప్టెంబర్ లో ఆమోదంపొందాయన్నారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న సీజేఐ, 'పది బిల్లుల్లో మూడు బిల్లులు గతేడాది సెప్టెంబర్ లో పాస్ అయ్యాయి. ఈ బిల్లులపై గవర్నర్ కార్యాలయం నుంచి ఏవైనా ఫైనల్ ఇండికేషన్స్ ఉన్నాయా?' అని ఎస్ జీ ని ప్రశ్నించారు. ఎస్ జీ జోక్యం చేసుకొనీ, ఈ అంశాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలను చేయలేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ బిల్లులపై గవర్నర్ కార్యాలయంతో చర్చించినట్టు తెలిపారు. మధ్యలో జోక్యం చేసుకున్న తెలంగాణ తరఫు ఏఓఆర్ ఒక వారం వాయిదా వేయాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 2022 సెప్టెంబర్ 9 నుంచి గవర్నర్ కార్యా లయంలో పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదంపై నిర్ణయం తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. పంచా యితీ రాజ్ చట్టం(అమైండ్ మెంట్) బిల్లు, ఆజామా బాద్ ఇండిస్ట్రియల్ ఏరియా(ఆమైండ్ మెంట్) బిల్లు- 2022 లపై న్యాయ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీజేఐ వెల్లడించారు. తదుపరి విచారణ నాటికి ఏం జరిగిందో చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.