Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లు పాయే..కొలువు గ్యారంటీ లేకపాయే
- ఆందోళనలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
- పెండింగ్‌లోనే రెండు నెలల వేతనాలు
- 28 నుంచి సమ్మెలోకి?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'సీఎం సారూ చేతులెత్తి వేడుకుంటున్నాం..దయచేసి పర్మినెంట్ చేయించండి' అంటూ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వేడుకుంటు న్నారు. ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగమొచ్చినా ప్రొబెషనరీ కాలం మాత్రం రెండేండ్లే. జేపీఎస్‌లకు మాత్రం ఎక్కడా లేని నిబంధన తీసుకొచ్చి పెట్టి మూడేండ్లు అని రాష్ట్ర సర్కారు కొర్రీ పెట్టింది. ఏడాదే ఎక్కువగా కదా..సర్కారు కొలువు ఎందుకు వదిలేయానే ఉద్దేశంతో గమ్ముగా పనిచేశారు. టైంకాగానే పర్మినెంట్ ప్రస్తావన ఎత్తితే..'కాదు..కాదు..ఇంకా ఏడాది పెంచుతున్నాం' అని మెలిక పెట్టి కూర్చున్నది. కుంటలో పడ్డాక బురద అంటకుండా పోతుందా భరిద్దాంలే అని జేపీఎస్‌లు చచ్చినట్టు కొలువుచేశారు. మంగళవారంతో నాలుగేండ్లు పూర్తవుతుంది. నేటికీ పర్మినెంట్ ప్రస్తావనే లేదు. 'ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూ పులు..బానిస బతుకులు' అని జేపీఎస్‌లు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 28 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019లో రిక్రూట్మెంట్ టెస్టు ద్వారా 9,355 పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసింది. మూడేండ్ల ఒప్పందం మీద 2019 ఏప్రిల్ 12 నుంచి జేపీఎస్‌లు విధులు చేపట్టారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ, పల్లె ప్రగతి, హరితహారం, తదితర కార్యక్రమాల నిర్వహణతో పాటు 55 దాకా రిజిష్ట్రర్లను వారే చూసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కొండంత పనిని మీదేసుకుని పనిచేస్తున్నారు. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొబేషనరీ కాలం రెండేండ్లు మాత్రమే. వీరికి మాత్రం రాష్ట్ర సర్కారు మూడేండ్లు అని నిర్ణయిం చింది. ఈవిషయంలో పెద్దఎత్తున విమర్శలొచ్చినా రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గలేదు. దాన్ని రెండేండ్లకు కుదించి తమకూ పీఆర్సీ వర్తింపజేయాలని అధికారుల వద్ద జేపీఎస్‌లు ప్రాధేయపడ్డా కనికరించలేదు. ఈ గొడవ ఇలా ఉండగానే పుండుమీద కారం చల్లినట్టుగా వారి ప్రొబెషనరీ కాలాన్ని నాలుగేండ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ బాంబు పేల్చారు. జేపీఎస్‌లలో అసంతృప్తి పెరిగిపోతుండటం, ఓవైపు వీఆర్వో, వీఆర్ఏల గొడవ నడుస్తుండటంతో సీఎం కాస్త ఆలోచించి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా ఇస్తామని ఊరటని చ్చారు. కానీ, అమలు చేయలేదు. గతంలో ఇస్తున్న 15 వేల వేతనాన్ని రూ.28,719కి పెంచి ఊరటని చ్చింది. వాస్తవానికి రెగ్యులర్ అయితే వారికి మరింత వేతనం పెరగడంతో పాటు పీఎఫ్, ఇతర ఉద్యోగులకు లభించినట్టుగానే అన్ని సౌకర్యాలు వర్తిస్తాయి. కానీ, రాష్ట్ర సర్కారు అలా చేయలేదు.
ఔట్సోర్సింగ్ జేపీఎస్‌ల పరిస్థితి మరీ దారుణం
పంచాయతీ కార్యదర్శులు రిటైర్డ్ అయినా, పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శులు వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసినా 2019 నోటిఫికేషన్ మెరిట్ లిస్టులో ఉన్నవారిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. మొదటి మూడు మెరిట్ లిస్టుల ద్వారా ఎంపిక చేసిన వారికి వేతనం రూ. 28,719 అందుతున్నది. ఆ తర్వాత మెరిట్ లిస్టు ద్వారా ఎంపికైన వారిని మాత్రం ఏజెన్సీల ద్వారా ఔట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తున్నారు. ఇలా పనిచేస్తున్నవారు రాష్ట్రంలో 1500 మంది వరకు ఉన్నారు. వీరికి మాత్రం ఒక్కో జిల్లాల్లో ఒక్కో విధంగా వేతనం అందుతున్నది. గరిష్టంగా రూ.15వేలు అందుతుండగా..కొన్ని జిల్లాల్లో అయితే రూ.11 వేలు మాత్రమే ఇస్తున్న దుస్థితి నెలకొంది. ఒకే ఎంట్రెన్స్ ద్వారా అర్హత సాధించిన వారికి వేర్వేరుగా వేతనాలు ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
పెండింగ్‌లో వేతనాలు..ఆదుకునేటోళ్లు లేరు..
రాష్ట్ర సర్కారు జేపీఎస్‌లకు వేతనాలను కూడా సకాలంలో ఇవ్వడంలేదు. ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలు ఇప్పటిదాకా జేపీఎస్‌ల చేతికి అందలేదు. 'మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తే ఎలా బతకాలి? పొద్దుగాల ఏడు గంటలలోపే పంచాయతీలో పని ప్రదేశం నుంచి ఫొటో తీసి ఉన్నతాధికారులకు ఫొటో పెట్టాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా పొద్దుగాల ఏడుగంటలకు వచ్చి సాయంత్రం ఆరేడు గంటల దాకా పనిచేస్తున్నారా?గొడ్డుచాకిరీ చేస్తున్నాం' అని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ జేపీఎస్ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. కొంతమంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అధిక పని భారాన్ని భరించలేక తమ ఉద్యోగానికి రాజీనామా చేసిపోతున్నారు. మరికొంతమంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. గుండెపోటు, గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రాలకు, ఇండ్లకు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటిదాకా దాదాపు 30 మంది జేపీఎస్‌లు చనిపోయారు. 50 మందిదాకా గాయపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సహకారం పెద్దగా లభించడంలేదు. జేపీఎస్లే తమ జీతాల్లోంచి తలా వెయ్యి, రెండు వేల రూపాయలు ఇచ్చి బాధిత కుటుంబాలకు కొంత ఆసరాగా నిలుస్తున్నారు.
జేపీఎస్‌లను క్రమబద్ధీకరించాలి
గౌరినేని రాజేశ్వర్‌రావు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు
గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చూస్తున్నాం. హరితహారం, శానిటేషన్, జనన, మరణ ధ్రువీకరణలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి పనులు , లైసెన్స్ అనుమతులు, ఉపాధి హామీ పనులు, కోవిడ్ సర్వేలు, డ్రై డేల నిర్వహణ, కంటి వెలుగు కార్యక్రమాలు, పోడు భూముల సర్వేలు, విపత్తు నిర్వహణ సంబంధించిన మొదలగు అనేక రకాల పనులను చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వేలు కూడా చేస్తున్నాం. జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ నుంచి తెలంగాణకు ఉత్తమ అవార్డులు రావడంలో కీలకపాత్ర పోషిస్తున్నాం. మూడేండ్లకు పర్మినెంట్ అన్నారు. ఆ తర్వాత నాలుగేండ్లకు పెంచారు. నాలుగేండ్లవుతున్నా పర్మినెంట్ ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రొబేషనరీ పీరియడ్‌ను సర్వీస్ పీరియడ్‌గా మార్చాలని వేడుకుంటున్నాం. ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న జేపీఎస్‌లను కూడా పర్మినెంట్ చేయాలి.