Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 వరకు జరపాలని తెలంగాణ రైతుసంఘం పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెేఎస్) 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నుంచి ఈనెల 13 వరకు గ్రామాల్లో సభలు, ప్రదర్శనలను జరిపి సంఘం జెండావిష్కరణలు చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్లను తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, రాష్ట్ర నాయకులు ఆర్ రాహుల్, ఆర్ ఆంజనేయులులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ దున్నేవాడికే భూమి, ఆంగ్లేయులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలనే నినాదంతో 1936, ఏప్రిల్ 11న స్వాతంత్రోద్యమంలో భాగంగా ఏఐకేఎస్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ పేదల్ని సంఘటిత పరిచిందన్నారు. భూస్వామ్య విధానాన్ని సమూలంగా రద్దు చేయడం, పేద రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యత పునాదిగా రైతాంగాన్ని ఏకం చేసిందని చెప్పారు. రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహించడంతోపాటు ఇతర వర్గాల పోరాటాలకు సంఘీభావం తెలిపిందని అన్నారు. మార్కెట్ గుత్తాధిపత్యంతో సాగే దోపిడీని ఎదిరించిందని వివరించారు. వ్యవసాయంలో విదేశీ కంపెనీల చొరబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. వడ్డీ ప్రమాణాల మెరుగుదల కోసం, గ్రామీణ ప్రజల సాంస్కృతిక అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. సంఘం నాయకత్వాన వర్లీ ఆదివాసుల పోరాటం, తెభాగ పోరాటం, పున్నప్రావాయలార్, గణముక్తి పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగాయని గుర్తు చేశారు. భూ సంస్కరణలను అమలు జరపాలంటూ సాగిన పోరాటంతో 1968లో మొదటిసారి, 1973లో రెండోసారి అవి అమలయ్యాయని చెప్పారు. ఫలితంగా 64.96 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని 54.02 లక్షల ఎకరాలను దేశవ్యాప్తంగా జపంపిణీ చేశారని వివరించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఢిల్లీలో రైతాంగ పోరాట ఫలితంగా కేంద్రం ఉపసంహరించుకున్నదని అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీల అమలు, కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం కోసం మరో పోరాటానికి సిద్దం కావాలని రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు.
మిగిలిన రైతులకు
తక్షణమే రైతుబంధు విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం రబీలో రైతుబంధు ప్రకటించి రైతుల ఖాతాల్లో నగదును జమ చేసిందని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి టి సాగర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానీ కొంతమంది రైతులకు సుమారు రూ.300 కోట్ల బిల్లులు ట్రెజరీ వద్ద గత 50 రోజులుగా పాస్ చేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బిల్లులు రాని వారిలో రైతుబందు బాధితులున్నారని పేర్కొన్నారు. ఈ కొద్ది మంది రైతులకు జమ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నారని వివరించారు. గతనెల 31వ తేదీ వరకు డబ్బులు ఖాతాల్లో వేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రైతులకు ఈనెల 15వ తేదీ వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత రైతులంతా ఆందోళనకు సిద్దమవుతారని పేర్కొన్నారు.