Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల డాక్యుమెంట్లు సమర్పించాలన్న హైకోర్టు
- గదుల తాళాలు తీసేందుకు యత్నించిన జగిత్యాల కలెక్టర్
- తెరుచుకోని స్ట్రాంగ్‌రూం తాళాలు
- అందులోనే కీలక 17ఏ, 17సీ డ్యాక్యుమెంట్లు, ప్రొసీడింగ్ పత్రాలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదం మలుపు తిరిగింది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఈవీఎంలు, ఇతర డ్యాక్యుమెంట్లు, సీసీ ఫుటేజీల వివరాలు సమర్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు సోమవారం కలెక్టర్ యాస్మిన్‌బాషా స్ట్రాంగ్‌రూమ్ గదుల తాళాలు తెరిచేందుకు ప్రయత్నించగా సంబంధిత 'కీ' లేకపోవడంతో గందరగోళం నెలకొంది. సగదు గదుల తాళం చెవులు (కీ లు) తమ వద్ద లేవని, ఇదే విషయం కోర్టుకు చెబుతామని కలెక్టర్ చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. స్ట్రాంగ్ రూం తాళాల కీలు మాయం కావడం ఏంటని ప్రశ్నించాయి. ప్రభుత్వ సహకారంతో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వరే కుట్ర చేశారని, ఆయనపై ఓటమిపాలై ఫలితాల రీకౌంటింగ్‌పై కొట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అడ్లూరి' పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వులు..
2019 సాధారణ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని, ఫలితాలు తారుమారు చేశారని ఆరోపిస్తూ సమీప అభ్యర్థి.. కాంగ్రెస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. గతంలోనే ఈవీఎంలలోని ఓట్ల రీ కౌంటింగ్ చేయాలని పలుమార్లు కోర్టు మెట్లెక్కారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు వారం కింద కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను తెరవాలని ఆదేశించింది. అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఏ, 17సీ డ్యాక్యుమెంట్లు, సీసీ ఫుటేజీలు, ఎలక్షన్ ప్రొసీడింగ్‌ను ఈనెల11న (నేడు) సమర్పించాలని ఆ సమయంలో ఉన్న రిటర్నింగ్ అధికారి భిక్షపతికి నోటీసులు ఇచ్చింది. దీంతో సోమవారం కలెక్టర్, ఇతర అధికారగణమంతా జిల్లా కేంద్రంలోని వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు వెళ్లారు. ఆ గదుల తాళాలు తెరిచే ప్రయత్నం చేయగా ఈవీఎంలు ఉన్న గది మాత్రమే తెరుచుకుంది. కోర్టు అడిగిన డ్యాక్యుమెంట్లు ఉన్న గదుల తాళాలు తెరచుకోలేదు. సదరు తాళాల 'కీ'లు కూడా అధికారుల దగ్గర లేవు. దీంతో కలెక్టర్ తాళం చెవులు(కీ లు) లేవన్న విషయాన్ని కోర్టుకు చెబుతామని తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్ గదుల తాళాలు పగలగొట్టి అయినా డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజీలు బయటకు తీయాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబట్టగా.. కోర్టు అనుమతి ఇవ్వకుండా పగలగొట్టలేమని కలెక్టర్ స్పష్టం చేశారు.
అధికారుల దగ్గర ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయి?
ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి- ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌కుమార్
కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్ దగ్గర ఉండాల్సిన స్ట్రాంగ్‌రూమ్ తాళాల కీలు ఏమయ్యాయి.. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి ఆరు రోజులు గడిచినా తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియకపోవడం ఏంటి? అని పిటిషన్‌దారుడు, కాంగ్రెస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రశ్నించారు. అధికారుల వద్ద ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు వారి దగ్గర లేకపోవడానికి గల కారణాన్ని చెప్పాలని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని నాలుగేండ్లుగా తాను పోరాడుతుంటే ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు.