Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు సీజన్లో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- సీఎంఆర్ లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదు
- 30లోగా అప్పగించాల్సిందే
- పాత బియ్యం ఇస్తేనే కొత్త ధాన్యం ఇస్తాం
- రాష్ట్రంలో ప్రతి రైస్ మిల్లును సీఎంఆర్ లో భాగాస్వామ్యం చేస్తాం
- తొమ్మిదేండ్లలో ఆరు రేట్లు పెరిగిన ధాన్యం కొనుగోళ్ళ
- మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రులు టి.హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎస్.నిరంజన్ రెడ్డిలు ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని కొనుగోళ్లకు సిద్దం కావాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలనీ, ఇందు కోసం 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ క్రమంలో ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సేకరణపై జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీఎంలు, ఎఫ్‌సీఐ అధికారులతో సోమవారం బి.ఆర్.కె భవన్లో వారు ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమీషనర్ అనీల్ కుమార్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేందర్‌లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీ.ఎంలు, ఎఫ్.సి.ఐ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 'దాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్దం చేసుకోవాలి. వచ్చే వారంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తాం. యాసంగి సీజన్ సీఎంఆర్‌ను ఈ నెల 30వ తేదిలోగా మిల్లర్లు నుంచి సేకరించాలి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక నుంచి సీఎంఆర్ అప్పగించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన ఉపేక్షించబోం. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ ని అప్పగించి ఈ సీజన్ సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలి. ఇప్పటి వరకు ఆ ప్రక్రియలో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్ నుంచి భాగాస్వామ్యం చేస్తాం....' అనిమంత్రులు ప్రకటించారు.
దేశంలో ఆయా రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమే అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని వారు సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నదనీ, 2014-15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి రూ.26,600 కోట్లు అందుకోసం వెచ్చించామని తెలిపారు. తొమ్మిదేండ్లలో ఆరు రెట్లు ధాన్యం కొనుగోళ్లు పెరగ్గా... మిల్లింగ్ సామర్థ్యం రెండు రెట్లు మాత్రమే పెరిగిందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ల నుంచి సి.యం.ఆర్ సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలనీ, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.