Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 60 అమలు చేయాలి
- గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ డిమాండ్ చేసింది. జీవో నెంబర్ 60 అమలు చేసి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.15,600 వేతనం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డికి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్, డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర అధ్యక్షులు టేకెం ప్రభాకర్, రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మచారి, లక్ష్మణ్ నాయక్, జలంధర్, అనురాధ, స్వరూప, లక్ష్మి, జయ, బాలరాజు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 527 అమలు ద్వారా ప్రస్తుతం ఇస్తున్న రూ.12 వేల వేతనం నుంచి రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు జీతాలు తగ్గుతాయని ఏడీ దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 60 అమలు చేసి రూ.15,600 వేతనం ఇప్పించాలని కోరారు. ఉన్న వేతనాలను తగ్గించాలనే ప్రభుత్వ ఆలోచన కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని వాపోయారు. పెండింగ్‌లోని 21 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో డైలీవేజ్ కార్మికులకు బ్యాంకు అకౌంటు ద్వారా వేతనాలు చెల్లించకుండా వార్డెన్లు, హెచ్ఎంలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనీ, 11 నెలలుగా వేతనాలు చెల్లించటం లేదని ఏడీ దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు అకౌంట్లో ద్వారా కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు పీఎఫ్ జమ చేయకుండా సంబంధిత కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడుతున్నారనీ, ఏజెన్సీలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఏడీకి విన్నవించారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.