Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు
- నిరాశతో వెనుతిరిగిన ఫిర్యాదుదారులు
- ముందస్తు సమాచారం లేదంటున్న ఉద్యోగస్తులు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అధికారులకు తమ సమస్యలను, గోడును విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలకు ప్రజావాణి రద్దయినట్టు తెలియడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. సంబంధిత అధికారులకు సైతం కలెక్టరేట్‌కు వచ్చిన తర్వాతనే రద్దయిన విషయం తెలిసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
భగభగమనే మండే ఎండలను సైతం లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, పిల్లలు, మహిళలు, రైతులు.. రాయపర్తి, వర్ధన్నపేట, నర్సంపేట, నల్లబెల్లి, ఖిలావరంగల్ వంటి పలు మండలాల నుంచి కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చారు. తీరా ప్రజావాణి రద్దయినట్టు తెలియడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లనే ముందస్తు సమాచారం అందటం లేదని పలువురు బహిరంగంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రజావాణి నిర్వహించడానికి ఆనానుకుల పరిస్థితులు తలెత్తినప్పుడు ముందస్తుగా ప్రజలకు సమాచారాన్ని అందజేస్తే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రయాసపడాల్సిన అవసరం ఉండదని బాధితులు వాపోతున్నారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయే తప్ప ఏండ్ల తరబడి తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజావాణి లేదని ఇక్కడికి అచ్చినంక తెలిసింది : వక్కల రవి, రైతు నల్లబెల్లి
పూర్వికుల నుంచి వారసత్వంగా నాకు వచ్చిన 1.19 ఎకరాల భూమి మీద గతంలో బ్యాంకులో లోన్ తీసుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాసుబుక్కులు ఇచ్చింది. 2021 తర్వాత 1-బి లో ఒక ఎకరం భూమి చూపెడుతుంది. మిగతా 19 గుంటల భూమి 1-బిలో నమోదుకాక కార్యాలయం చుట్టూ తిరగలేకపోతున్నాను.
రైతుబంధు ఎకరం భూమికే వస్తుంది.19 గుంటల భూమికి పడట్లేదని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదు. ముందస్తు సమాచారం ఇస్తే సమయం డబ్బు ఖర్చు అయ్యేది కాదు.