Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను కొనసాగించాలి
- టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా నూతన పే రివిజన్ కమిటీ (పీఆర్సీ)ని వెంటనే ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో టీఎన్జీవో కేంద్ర సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించామని వారు తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. 2004, సెప్టెంబర్ ఒకటి నుంచి నియమితులైన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ఒక శాతం చందాతో ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. గచ్చిబౌలిలోని ఇండ్లస్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు చేసి వెంటనే బీటీఎన్జీవోకు కేటాయించాలని తెలిపారు. రాష్ట్ర నూతన సచివాలయం తోపాటు అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో టీఎన్జీఓకు కార్యాలయాలు కేటాయించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి పేర్కొన్నారు. రెండేండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న పంచాయతి కార్యదర్శులకు పదోన్నతి ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని, డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. టీఎన్జీవో కేంద్ర సంఘానికి ఎన్నికల గడువు ఈ ఏడాది జూన్‌లో ఉన్నందున ఆలోగానే జరపాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావుతో జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.