Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఏమైంది : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులకు సరిగ్గా జీతాలే ఇయ్యలేనోడు.. వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ పాల్గొంటాడా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులతో కలిసి ఆయన బలగం సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బిచ్చమెత్తుకునే స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. దమ్ముంటే వరంగల్ సీపీ కాల్ లిస్ట్ ను బయటపెట్టాలని సవాల్ విసిరారు. త్వరలో వరంగల్ సీపీ అవినీతి, అక్రమాల బండారం బయటపెడతానన్నారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తానేమైనా టెర్రిరిస్టునా? బెయిల్ ఎందుకు రద్దు చేయాలి? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఏం తప్పు చేశారని నోటీసులిస్తారని నిలదీశారు. డబ్బు సంబంధాలే తప్ప మానవ సంబంధాల్లేని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి, మా అత్తమ్మ పక్షిముట్టే కార్యక్రమాలను జరగనీయకుండా ఇబ్బందికి గురిచేసిన నీచుడన్నారు. ఆయనకు బలగం సినిమా చూపిస్తేనైనా కనువిప్పు కలుగుతుందేమోనన్నారు. డైరెక్టర్ వేణు సహా బలగం సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే మా లక్ష్యం
బీజేపీ జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్
తెలంగాణలోని 19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తున్నదనీ, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేశామని బీజేపీ జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుభాష అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ మీనన్ మాట్లాడుతూ..ఆ నియోజకవర్గాల్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులను మండలాల ఇన్‌చార్జీలుగా నియమించి ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా ఇన్చార్జి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి పలువురు మహారాష్ట్ర నేతలు
అధికార బీఆర్ఎస్లోకి సోమవారం పలువురు మహారాష్ట్ర నేతలు చేరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత శంకర్న దోంగే నేతృత్వంలో ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సోలంకే, మాజీ ఎమ్మెల్యే విజరు దోంబరే, మాజీ స్పీకర్ సుశీల్ ఘోటే, గులాబీ కండువా కప్పుకున్నారు.