Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్‌కుమార్ హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో నిరంతరం దళితులపై హింసకు పాల్పడుతున్న ఆర్ఎస్ఎస్-బీజేపీ ఫాసిస్ట్ బ్రాహ్మణీయ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్‌కుమార్ తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మతి తీసుకరావడానికి బీజేపీ, కాషాయ దళాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. భారత రాజ్యాంగాన్ని క్రమపద్ధతిలో మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్ లో సోమవారం తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆఫీస్ బేరర్ల్ల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బందెల నరసయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా మరుపాక అనిల్‌కుమార్ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దౌర్జన్యాలు, హింస రోజురోజుకు పెరిగిపోతున్నా యని చెప్పారు.
సమాన హక్కులు అడుగుతున్న దళితులపై దాడులు చేసి కాషాయ దళాలు చంపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవించే హక్కులను కాపాడడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని అయన విమర్శించారు. దళితులపై దాడులను ప్రతిఘటిస్తూ, రాజకీయ సాధికారత, గుర్తింపు, ఆత్మ గౌరవం, హక్కులు కోసం సామూహిక ఉద్యమాలు నిర్మిం చాలని ఈ సందర్బంగా అనిల్‌కుమార్ పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో డీహెచ్‌పీఎస్ గౌరవ అధ్యక్షులు కె.యేసురత్నం, కార్యనిర్వాహక అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కె.రత్నకుమారి, వై.ఉషాశ్రీ, సహదేవ్, కె.రాజరత్నం, దేవి, పొచన్న, బి.లక్ష్మీపతి, కె.వెంకటస్వామి, ఆరుట్ల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.