Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కమిషన్ నిబంధనలే తప్పు
- కంకి కొడవలి గుర్తుకు ఎలాంటి ఇబ్బంది లేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దాదాపు వందేండ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ హోదాను ఎన్నికల కమిషన్ ఉపసంహరించడం అవివేకమైన చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలే తప్పుగా ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో దీనిపై సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని జాతీయ హోదా ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. ఎన్నికల అవగాహనలు, సీట్ల సర్దుబాట్లు ఉంటాయని వివరించారు. అన్ని సీట్లలో పోటీ చేసే అవకాశముండబోదని పేర్కొన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తప్పుడు విధానంతో జాతీయ హోదాను తొలగించడం సరైంది కాదని తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు డబ్బు, ప్రలోభాల మయం అయిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రంలో ఆ తర్వాత అనేక కీలక మలుపుల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. దామాషా ఎన్నికలు నిర్వహిస్తే అసలు బలం తెలుస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వమే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును భరించాలని డిమాండ్ చేశారు. బహుముఖ పోటీలో 20 లేదా 30 శాతం ఓట్లు వచ్చినా అభ్యర్థు లు గెలుస్తున్నారని వివరించారు. కనీసం 50 శాతం ఓట్లు రాని విజేతకు జనామోదం లేదని భావిస్తామా?అని ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తు కంకి కొడవలికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.