Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తునకు సహకరించడం లేదు
- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు దర్యాప్తునకు ఆ కేసులో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఫోన్‌ను కూడా ఇవ్వడంలేదని చెప్పింది. దర్యాప్తు అధికారికి ఆయన ఫోన్ అప్పగించేలా ఆదేశాలివ్వాలని కోరింది. ఈ మేరకు ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణకు సహకరించనందున సంజరు కింది కోర్టు గతంలో ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేసి హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచిన కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జైలు నుంచి సంజరు విడుదలైనందున ఈ పిటిషన్లో విచారణ అవసరం లేదని ఏజీ వాదనలు వినిపించారు. బండి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించనున్నారని విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఎంపీ అర్వింద్‌కు వెసులుబాటు
అట్రాసిటీ కేసులో నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు హైకోర్టులో వెసులుబాటు లభించింది. వ్యక్తిగత పూచీకత్తులపై ముందుస్తు బెయిల్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. 2022, జనవరిలో చంచల్‌గూడ వద్ద విలేకరుల సమావేశంలో అనుచితంగా మాట్లాడారన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలనీ, ఈలోగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎంపీ హైకోర్టులో రిట్ దాఖలు చేశా రు. అర్వింద్‌ను అరెస్టు చేయబోమని పోలీసుల తరఫు న్యాయవాది చెప్పగా పైవిధంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.
వివేకా హత్య కేసు నేటికి వాయిదా
ఏపీకి చెందిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మారారని చెప్పి అతనికి క్షమాభిక్ష పెట్టడాన్ని సవాల్ చేసిన పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్లను జస్టిస్ సురేందర్ విచారణ చేపట్టారు.