Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధురాలు, ట్రేడ్ యూనియన్ నేత విమలా రణదివె 108వ జయంతిని సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విమలా రణదివె చిత్ర పటానికి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు. సమాజంలో దోపిడీ పోవాలంటే వర్గపోరాటం తప్ప మరొకటి లేదని చెప్పి కార్మిక పోరాటాన్ని ఉధృతం చేసిన మహనీయురాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వదేశీ జపం చేస్తూ మన దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, మతోన్మాద శక్తులకు కట్టబెడుతున్నదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం మనుగడకే ప్రమాదం ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలను, రైతాంగాన్ని, పేద ప్రజలను సమీకరించి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడుతూ.. విమలా రణదివె 12వ ఏటనే దేశ స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నదనీ, 6 నెలలు జైలు శిక్షను కూడా అనుభవించారని గుర్తుచేశారు. వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ పత్రిక ఎడిటర్‌గా, అంగన్వాడీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళలను పోరాటాలలో భాగస్వామ్యం చేయకుండా దేశం విముక్తి కాదని నొక్కి చెప్పారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, కార్యదర్శి పి. శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు వై. సోమన్న, పి. సుధాకర్, ఎ. సునీత, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.