Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలోని మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలనే ఆకాంక్షలతో ఆధిపత్య వ్యతిరేక పోరాటం కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మాజ్యోతిరావు గోవిందరావు ఫూలే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనని తెలిపారు. ఫూలే 197వ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలు, త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఫూలే 200 ఏండ్ల క్రితమే కార్యాచరణ చేపట్టారని సీఎం గుర్తుచేశారు. ఆయన అనుసరించిన సామాజిక సమానత్వ పంథా, నాటి భారతీయ సమాజంలో కొనసాగుతున్న సాంప్రదాయ సామాజిక విలువలను, వ్యవస్థలను సమూలంగా మార్చివేసేందుకు బాటలు వేసిందని తెలిపారు. గుణాత్మక మార్పు దిశగా దేశంలోని స్త్రీలు, దళిత బహుజనులు ఉద్యమించేలా ఫూలే కార్యాచరణ పురికొల్పిందని పేర్కొన్నారు. ఫూలేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా తన గురువుగా ప్రకటించుకున్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకుని అభివద్ధి, సంక్షేమ కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలిపారు. జ్యోతిబాఫూలే అందించిన స్ఫూర్తితో 'వికాసమే వివక్షకు విరుగుడు' అనే విధానాన్ని అనుసరిస్తూ తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని మహిళా, దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించి సామాజిక సమానత్వ దిశగా పురోగమించాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వారి సామాజిక, ఆర్థిక ఆత్మగౌరవాలను ద్విగుణీకతం చేస్తున్నాయని వివరించారు. తమ ప్రభుత్వం చేస్తున్న ఈ కషి వెనుక మహాత్మాబాఫూలే ఆదర్శాలు, ఆశయ సాధన లక్ష్యాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు.