Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 వేల మంది కార్మికుల గోస పట్టదా
- వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి : పాలడుగు భాస్కర్
- పంచాయతీరాజ్ కమిషనరేట్ ఎదుట జేఏసీ ధర్నా
- డిప్యూటీ కమిషనర్ రామారావుకు వినతి
నవతెలంగాణ - హిమాయత్‌నగర్
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పెంచినట్టుగా పంచాయతీ కార్మికులకు జీతాలెందుకు పెంచరని గ్రామ పంచాయతీ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 50 వేల మంది కార్మికుల గోస పట్టదా? అని నిలదీశారు. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలనీ, పని భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నానుద్దేశించి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 50వేల మంది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనిభారం పెంచి వేతనాలు పెంచకపోవటంతో కార్మికులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, మానసికంగా అలసిపోయి అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.15,600 వేతనం చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకే విధమైన పనిచేస్తున్న పంచాయితీ కార్మికుల పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. గ్రామపంచాయితీ సిబ్బందికి స్కిల్డ్, సెమీ, అన్‌స్కిల్డ్ కేటగిరీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అందర్నీ పర్మినెంట్ చేయాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా పంచాయతీ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలనీ, మల్టీపర్పస్ పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన కారోబార్, బిల్ కలెక్టర్లకు పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. ఎస్కేడే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని విన్నవించారు. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, ప్రమాదవ శాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారాంతపు సెలవులు, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు నర్సింహ్మారెడ్డి, జయచంద్ర, వెంకటరాజం, శివశంకర్, మల్లయ్య, యజ్ఞనారాయణ, సదానందం, పాలడుగు సుధాకర్, వెంకటయ్య సూర్యం, సాంబశివరావు, శివబాబు, దాసు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.