Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న గవర్నర్
- నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లోనే..
- గవర్నర్‌పై మంత్రి హరీశ్‌రావు విమర్శలు
- మూడు బిల్లులు పాస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి
నవతెలంగాణ-కొండపాక
కోర్టులో కేసులు వేస్తే తప్పా బిల్లులు పాస్ కాని దుస్థితి నెలకొన్నదని, రాష్ట్ర అభివృద్ధిని గవర్నర్ అడ్డుకుంటున్నారని, బిల్లులు పాస్ చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాలుగు జిల్లాలకు తాగు నీరందించే ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం మంగోల్‌లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటున్నదని విమర్శించారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ అమోదించకుండా 7 నెలలుగా పెండింగ్‌లో పెట్టారన్నారు. దీని వెనుక రాజకీయం ఏంటనేది అందరికి తెలుసని.. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే తప్ప బిల్లులు పాస్ కానీ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈరోజు రెండు, మూడు బిల్లులు పాస్ చేశారని.. రాష్ట్ర ప్రగతిని బీజేపీ అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. దేశంలో తొలిసారిగా ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారన్నారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని ప్రశ్నించారు. అలాగే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే.. 7 నెలలు అపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడి పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 1961 నుంచే ఉన్నదని.. ఇక్కడ మాత్రం ఇలా చేయడం సబబేనా అన్నారు. గవర్నర్ రాష్ట్ర ప్రగతికి సహకరించడం మాని మోకాళ్లడ్డు పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు. కాగా, మూడు బిల్లులను ఆమోదించడం పట్ల గవర్నర్‌కు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.