Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మసీదులు తవ్వుదాం..
- పేపర్ లీక్ చేద్దామనేటోళ్లు మనకొద్దు
- ఆక్వా హబ్‌లో స్థానికులకు ఉపాధి : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
తెల్లారిలేస్తే మసీదులు తవ్వుదామా.. పేపర్ లీక్ చేద్దామా అనే వారికి ఓటు వేయొద్దని.. ఈ సారైనా మంచి వారిని కరీంనగర్ ఎంపీగా గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సోమవారం మంత్రి విస్తృత పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, మహనీయుల విగ్రహావిష్కరణలు చేశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఎస్సీ, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. బీఆర్.అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటి వరకు రూ.12కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముంపు ప్లాట్లకు డబ్బులు రాని వారు, 18 సంవత్సరాలు నిండి డబ్బులు రాని వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. 350 ఎకరాల్లో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మండల కేంద్రంలో త్వరలోనే రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుందని చెబుతూ.. 'ఎంపీ సక్కటోడు లేడుగనీ.. వినోద్‌కుమార్ లాంటి ఎంపీ ఉంటే ఈపాటికే రైలు కూడా వస్తుండే' అన్నారు. ఎంపీకి 'తెల్లారిలేస్తే లొల్లి.. ఒకటే మతం పంచాయితీ, మసీదులు తవ్వుదామా.. ఏడ పేపర్ లీక్‌లు చేద్దామా.. ఈ లొల్లి తప్ప అసలు లొల్లిలు లేవని' ఆరోపించారు. కాబట్టి ఈ సారైనా ఆలోచించి ఎంపీగా వినోద్‌కుమార్ లాంటి మంచోనికి ఓటేసి గెలిపించుకోవాలని కోరారు. గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలను హైస్కూల్‌గా అప్ గ్రేడ్ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తానని చెప్పారు. పరిహారం రాని నిర్వాసితులు ఎవరైనా ఉంటే బాధపడొద్దని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.