Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- విద్యార్థులకు భరోసా ఇవ్వని ప్రధాని
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణలో పారదర్శకత ఉండాలంటే.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మఖ్దుం భవన్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సాంబశివరావు మాట్లాడారు.
ప్రధాని మోడీ నగర పర్యటనలో బాధిత విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు కానీ.. రెండు పేపర్ల లీకేజీ కేసులో ప్రమేయమున్న బండి సంజరుకు భరోసా ఇచ్చేవిధంగా చేయి కలిపారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందన్నారు. 10వ తరగతి పేపర్ బయటకు వచ్చిన వ్యవహారంలో ప్రశాంత్‌కు బీజేపీ అధ్యక్షులు బండి సంజరు ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయాలని, పర్మినెంట్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. భగత్‌సింగ్ స్ఫూర్తితో ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేయాలని.. వారికి తమ మద్దతుంటుందని భరోసా ఇచ్చారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణతోపాటు బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్‌తోపాటు ప్రతి రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఏఐఎస్ఎఫ్ ఆల్ఇండియా అధ్యక్షులు శివం బెనర్జి తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. అక్రమ సంపాదన కోసమే పథకం ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి సంఘీబావం తెలిపారు. పేపర్ లీకేజీలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడినట్టేనని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని గుర్తు చేశారు. ఉద్యోగాల సాధన కోసం అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటారని, ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్ లీకేజీలకు పాల్పడ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదులొద్దన్నారు. ఆర్ఎస్ఎస్ కమాండ్‌తో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అవినీతి పెరిగిపోయిందని, అందులో భాగంగానే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేసి బోర్డును ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానివ్వా లన్నారు. టీఎస్పీఎస్సీతోపాటు పదో తరగతి పేపర్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజరును వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.