Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్మణ్ నోట...యురేనియం మాట
- అభివృద్ధి కాదు లక్ష్మణా.. నల్లగొండ ఎడారే
- నల్లమలలో ఆ నిక్షేపాలను వెలికితీస్తే అంతే
- ఐదు జిల్లాలపై ఎఫెక్ట్ పడే అవకాశం
- నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెను ప్రమాదం
- రాజధానిలో తాగునీళ్లకూ కష్టమే
- నల్లమల నిక్షేపాలపై కేంద్రం కన్ను
దేని పేరు చెబితే తెలంగాణ సమాజం ఏడాదికిపైగా ఉలిక్కిపడిందో దాని పేరు మళ్లీ బీజేపీ నేతల నోటి నుంచి వినపడింది. వినాశనంతో కూడిన అభివృద్ధి వద్దేవద్దు.. ప్రత్యామ్నాయాలెన్నో ఉన్నాయంటూ రాజకీయపార్టీలు, యువజన సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలంతా కలిసి 'సేవ్ నల్లమల ఫారెస్ట్' పేరుతో ఉద్యమాలు చేసి అడ్డుకున్న యురేనియం తొవ్వకాల అంశాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మళ్లీ తెరపైకి తెచ్చారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యురేనియం తవ్వకాలతో నల్లగొండ జిల్లా అభివృద్ధి జరుగుతుదంటూ తమ పార్టీ నిజస్వరూపం ఏమిటో లక్ష్మణ్ చెప్పకనే చెప్పారు. వేల కొలది ఉద్యోగాలు దేవుడెరుగుగానీ తవ్వకాలు జరిగితే నల్లగొండ జిల్లా ఎడారిగా మారుతుంది. కృష్ణానది కాలుష్యకాసారమవుతుంది. ఆధునీక దేవాలయం ప్రసిద్ధిగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒట్టిపోతుంది. యురేనియం ధాతువు భూమిలో ఉన్నంత వరకు ఏమీ కాదు. దాన్ని వెలికి తీస్తే మాత్రం అది వేగంగా గాలిలోకి, భూగర్భజలాల్లోకి వ్యాప్తి చెంది అక్కడి ప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారే ప్రమాదముంది. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ ప్రాంతంలో, ఏపీలోని పులివెందుల సమీపంలో జరుగుతున్న యురేనియం తవ్వకాల వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మనం కండ్లారా చూస్తూనే ఉన్నాం. పిల్లలు వింత ఆకారాల్లో పుట్టడం, అంగవైక్యం పొందడం, చర్మ సంబంధ, క్యాన్సర్ వంటి వ్యాధులు రావడం సజీవ సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాయి. జాదుగూడ పరిసరాల్లో ప్రజలు నివాసం ఉండలేక ఊర్లకు ఊర్లే ఖాళీ అవుతున్న పరిస్థితి. వాస్తవం ఇలా ఉంటే అభివృద్ధి జరిగేది అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ సమాజం చెవిలో పువ్వు పెట్టడమే అవుతుంది.
వాస్తవానికి 2019లో నల్లమలలో యురేనియం తవ్వకాల కోసం అంటూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో యూసీఐఎల్ హడావిడి చేసింది. అప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తొలుత చూసీచూడనట్టు ఊరుకుంది. కానీ, ప్రకృతి రమణీయమైన నల్లమలలో అడుగుపెట్టనీయబో మంటూ నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమమే కొనసాగింది. అది కాస్తా రాజధానికి పాకింది. రాజకీయ పార్టీలు, పర్యావరణ, యువజన, మేధావులతో కూడిన 63 సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి 'సేవ్ నల్లమల ఫారెస్ట్' పేరుతో ఊరూరా తిరిగి వివరించాయి. చెంచు పెంటల్లో, గ్రామాల్లో యురేనియ వ్యతిరేక కమిటీ, పొలిటికల్ జేఏసీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ, టీపీఎఫ్, తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులను నిర్వహించారు. జాదుగూడ, చెర్నోబిల్, అమెరికాలో యురేనియం తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదాలు, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన అంశాలను వీడియోల ద్వారా చూపెట్టి ప్రజలను చైతన్యపరిచారు. ఆ సమయంలోనూ బీజేపీ తన కపట నాటకాన్ని ప్రదర్శించింది. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వాళ్లు యురేనియం ప్రభావం వల్ల తమ గ్రామానికి రాబోతున్న ముప్పును వదిలేసి మోడీ సర్కారును వెనకేసుకొచ్చిన తీరు కొట్టొచ్చినట్టు కనిపించింది. ''పాకిస్తానోడు మనల్ని అణుబాంబులతో భయపెడుతున్నడు. మనమీద దాడిచేస్తే అణుబాంబులు ఉండాలి కదా! దేశం కోసం త్యాగాలు చేయాలి కదా! యురేనియం తీస్తే ఏం కాదు' అనే ప్రచారాన్ని చేయబోగా చెంచు గూడాల్లో ప్రజలు ఎక్కడికక్కడ తిప్పికొట్టడంతో వారి పప్పులు ఉండకలేదు. ఇంతింతై..వటుడింతై అన్నట్టుగా చెంచు బిడ్డల నుంచి మొదలైన పోరాటం రాజధానికీ పాకింది.
'తాము ప్రాథమిక సర్వేకు మాత్రమే అనుమతిచ్చాం. ఎట్టిపరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలకు అనుమతించబోం' అంటూ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. సహజవనరులను తమకిష్టమైన ఇద్దరు ముగ్గురు కార్పొరేట్లకు కట్టబెట్టే యావలో ఉన్న బీజేపీ తాను చేయాల్సినది ఆ పార్టీ నేతలో చెప్పించడం ఆనవాయితీగా వస్తున్నది. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు, విశాఖ స్టీలు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో కావాలనే మరోమారు యురేనియం బాంబును లక్ష్మణ్ చేత బీజేపీ అధిష్టానం వేయించిందని భావించాలి. లక్ష్మణ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రయివేటు పరిశ్రమలు అవసరం లేదా అంటూ మాట్లాడటం కూడా తాము నిజంగా పనిచేసేది కార్పొరేట్ల కోసమే అనేది నిగూఢ సత్యం.
నిక్షేపాలు ఉన్నా..
ఫ్రాన్స్‌లో 70 శాతం విద్యుత్ యురేనియం ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారని చెబుతున్న లక్ష్మణ్ ప్రపంచ దేశాలు తమ దేశాల్లో తవ్వకాలను ఎందుకు ఆపేస్తున్నాయో చెబితే బాగుండేది. మనకు యురేనియం ద్వారా విద్యుత్‌ను తయారు చేసుకోవాల్సిన ఆగత్యం లేదు. నూటికి 90 శాతానికిపైగా థర్మల్, హైడల్ పద్ధతిలోనే తయారు చేసుకుంటున్నాం. నీటి వనరులను సక్రమంగా వాడుకుంటే ఉత్పత్తిని ఇంకా పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. తయారీ కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. యురేనియంతో ఖర్చే కాదు కాలుష్యమూ ఎక్కువే. ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ప్రాజెక్టు చెర్నోబిల్. ఆ దాతువు దుష్పరిణామాలతో ఆ ప్రాజెక్టునే రష్యా నిలిపేసింది. అమెరికా, రష్యా, కెనడా వంటి దేశాలు యురేనియం తవ్వకాలనే ఆపేశాయన్నది బహిరంగ సత్యం.