Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతిస్తే నల్లగొండ అభివృద్ధి చెందేది
- కొన్ని వేల మందికి ఉద్యోగాలొచ్చేవి
- బయ్యారంలో బొగ్గు నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు : బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నల్లగొండ జిల్లాలో యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ ఏమో తొవ్వనిచ్చే ప్రసక్తే లేదంటున్నడు. పులివెందులలో యూసీఐఎల్ ద్వారా యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. నిక్షేపాలను వెలికి తీస్తున్నారు. ఇక్క డేమో కేసీఆర్ సర్కారు అడ్డుకుంటున్నది. ఒక కిలో యురేనియం విలువ 35 కేజీ ల బొగ్గుతో సమానం. ఫ్రాన్స్‌లో 70 శాతం ఎనర్జీ యురేనియం ద్వారానే ఉత్పత్తి అవుతున్నది. ఈ విషయంలో నల్లగొండ జిల్లా ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన రాష్ట్ర సర్కారు తన బాధ్యతను విస్మరించింది. తవ్వకాలు ప్రారంభమై ఉంటే కొన్నివేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉండేది. నల్లగొండ జిల్లా వేగంగా అభివృద్ధి చెందేది. ఇలాంటి వాటికి దిక్కులేదుగానీ విశాఖ స్టీలు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటు న్నారు' అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. తాను గొప్ప విజ్ఞాని అనీ, బీజేపీ వాళ్లు అజ్ఞానులు అన్నట్టు కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు. అమెరికాలో చదివినంత మాత్రాన మిగతా వాళ్లను చులకన చూసి మాట్లాడటం సరికాదనీ, దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా మన్నారు. కేటీఆర్ నిద్రలో కూడా అదాని, ప్రధాని అని కలవరిస్తున్నాడన్నారని విమర్శించారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకే దిక్కు లేదుగానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. హెచ్ఎమ్టీ, ఐడీపీఎల్, అజమ్ జాహి కంపెనీల మాటేంటని నిలదీశారు. హెచ్ఎమ్టీ, ఐడీపీఎల్ భూములపై బీఆర్ఎస్ నేతల కన్ను పడిందని ఆరోపించారు. మోడీ వచ్చాక 31 మినరల్స్ పై పూర్తి హక్కులను రాష్ట్రాలకు కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతి చేసుకొనే వాళ్ళమన్నారు. తమకు నచ్చినవాళ్లకు బొగ్గు గనులిచ్చి బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ కూరుకుపోయిందని విమర్శించారు. బయ్యారం ప్రమేయం లేకుండా కడప స్టీల్ ప్లాంట్ నడుస్తోంది కదా? అని ప్రశ్నించారు. ఎన్ఎమ్డీసీ ద్వారా ఆక్షన్‌లో పాల్గొని ఎవరైనా బొగ్గు నిక్షేపాలను కొనుక్కోవచ్చు నన్నారు. బైలడిల్ల నుంచి జపాన్ కంపెనీ బొగ్గు కొనుగోలు చేస్తోందనీ, దానికీ అదాని కంపెనీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బైలడిల్ల ద్వారా విదేశాలకు బొగ్గు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన పాలసీ తెచ్చారా? రాష్ట్రంలో ప్రయివేటు సంస్థల అవసరం లేదా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే కనీసం 200 మిలి యన్ టన్నుల ఐరన్ నిల్వలు ఉండాలనీ, బయ్యారంలో మాత్రం ఐదు మిలియన్ల టన్నుల స్టీల్ మాత్రమే ఉందని నిపుణుల నివేదికలు తేల్చి చెప్పాయన్నారు. అందుకే అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం లేదని చెప్పారు. ప్రశ్నపత్రాల లీకుల గురించి సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? బాధితులకు ఎందుకు భరోసా ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడతమంటే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. సింగరేణి లో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలు కేంద్రానికి తెలిసి జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు.