Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయ్యారాన్ని ఎండబెడుతున్నరు.. విశాఖ పొట్టగొడుతున్నరు...
- కేంద్రం చర్యలతో తెలుగు రాష్ట్రాలకు చావు దెబ్బ : మంత్రి కేటీఆర్
- తాను చెప్పింది తప్పయితే పరువు నష్టం దావా వేసుకోవాలంటూ బీజేపీకి సవాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ తన మిత్రుడైన అదానీకి దేశ సంపదను అప్పనంగా దోచి పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. అదానీ కోసమే తెలంగాణలోని బయ్యారాన్ని ఎండబెడుతున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పొట్టగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యలు... తెలుగు రాష్ట్రాలకు చావు దెబ్బలాంటివని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజరుకుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులతో కలిసి కేటీఆర్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, విశాఖ స్టీల్ ప్లాంటుకు గనుల కేటాయింపు తదితర విషయాల్లో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను ఆయన ఈ సందర్భంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కోరుతున్నా... కేంద్రం పట్టించుకోవటం లేదని తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాశారనీ, ఆనాటి గనుల శాఖ మంత్రిగా తాను ప్రధానికి వినతిపత్రం సమర్పించానని ఆయన గుర్తు చేశారు. బయ్యారంలో దొరికే ముడి ఖనిజం నాణ్యత రీత్యా అక్కడ కర్మాగారం స్థాపించటం సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పటం శోచనీయమన్నారు. అలాంటప్పుడు పక్కనే ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లోని బైలడిల గనుల నుంచి ముడి ఇనుమును సరఫరా చేయటం ద్వారా ఇటు బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయొచ్చు.. అటు విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవచ్చని తెలిపారు. కానీ ఈ పని చేస్తే బైలడిలలో సమీకృత ముడి ఇనుప ఖనిజ పరిశ్రమ(ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ కంపెనీ)ను నెలకొల్పిన అదానీకి నష్టమని... అందువల్లే ప్రధాని మోడీ దాని గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. అక్కడి ఇనుప ఖనిజం గనులను అదానీకి కట్టబెట్టటమే దీనికి కారణమని చెప్పారు. బైలడిల నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారానికి, 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు ఖనిజం సరఫరా చేయటం సాధ్యం కాదని చెప్పిన కేంద్రం...అక్కడి నుంచి 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్‌లోని ముంద్రాకు మాత్రం ఐరన్ ఓర్‌ను సరఫరా చేస్తోందని విమర్శించారు. ఈ రకంగా లాభాలను తన దోస్తులకు దోచి పెడుతున్న మోడీ.. నష్టాలను మాత్రం జాతికి అంకితం చేస్తున్నారని కేటీఆర్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చంటూ బీజేపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్న తమపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకు అసలు విషయ పరిజ్ఞానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రకంగా ప్రస్తుతం దేశాన్ని అదానీ, అజ్ఞానులు (బీజేపీ నేతలు) కలిసి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటంలో భాగంగా అక్కడి బిడ్డింగ్ ప్రక్రియలో తమ ప్రభుత్వం పాల్గొంటుందని తెలిపారు. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను, వాస్తవాలను పరిశీలించేందుకు రాష్ట్ర అధికారులు విశాఖకు వెళ్లారని వివరించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవటమనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి గురించి ప్రశ్నించగా... 'దానిపై ఎలాంటి ఆసక్తి లేదు.. ఇక్కడ ఏపీ ప్రభుత్వం కాదు, కేంద్రం ఏం చేస్తున్నదనేదే ముఖ్యం...' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.