Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ బ్లాక్ మెయిల్‌కు బెదరం
- దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయి
- సెటిల్మెంట్లు చేశానని నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తా.. : వరంగల్ సీపీ రంగనాథ్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
విధి నిర్వహణలో ఏ పార్టీకి లొంగిపని చేయనని, బండి సంజయ్ బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపణలపై పోలీసు కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. తాను ఎక్కడ పనిచేసినా ప్రజలు తనను గుర్తుంచుకుంటారన్నారు. పోలీసులు చేసిన దర్యాప్తును ఎవరైనా తప్పుపట్టడం సహజమని, అందులో భాగంగానే బండి సంజయ్ తనపై తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. వివిధ కేసుల్లో తాను నిందితులపై కఠినచర్యలు తీసుకుంటే కొందరికి బాధ ఉండొచ్చు.. వాళ్లే పోలీసులపై ఆరోపణలు చేస్తుంటారని తెలిపారు. తాను సెటిల్మెంట్లు చేశాననే ఆరోపణలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదని అన్నారు. సెటిల్మెంట్ చేయలేదని ప్రమాణం చేయాలంటూ బండి చేసిన సవాల్‌పై సీపీ స్పందిస్తూ.. సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తానని సీపీ సవాల్ చేశారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేసుకుంటూ పోతే ఇప్పటివరకు తాను పదివేల సార్లు ప్రమాణాలు చేసి ఉండాల్సిందని అన్నారు. విచారణకు ఈటల రాజేందర్ అద్భుతంగా సహకరించారని, వారిని గౌరవంగా చూసుకున్నామని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని, చట్టం ప్రకారమే నడుచుకున్నామని అన్నారు. తాను విధుల్లో చేరినప్పటి నుంచి రాజకీయాలకతీతంగా విధులు నిర్వహించానని, ఏ పార్టీ నేతలకు లొంగలేదని గుర్తుచేశారు. తనకు పోలీస్‌స్టేషన్ దేవాలయంతో సమానమని, ప్రజలు న్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కుతుంటారని, వారికి న్యాయం చేయడానికి మాత్రమే కృషి చేస్తానని అన్నారు. అంతేగాక స్పెషల్ ఆఫీసర్‌గా నందిగామకు తనను పంపించారని, సత్యంబాబు కేసులో తాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదని క్లారిటీ ఇచ్చారు. వరంగల్ హిందీ పేపర్ది లీకేజీ కేసు కాదని, ఇది కేవలం మాల్ ప్రాక్టీస్ కేసు మాత్రమేనన్నారు. మాల్ ప్రాక్టీస్ జరిగిందని ముందుగా చెప్పింది కూడా తానేనని వెల్లడించారు.