Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, సాంఘీక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు వేసవి క్యాంపులు : మంత్రులు సత్యవతి, కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన, సాంఘీక సంక్షేమ విద్యార్థులకు రాష్ట్రంలో స్వర్ణయుగం కొనసాగుతోందని మంత్రులు మంత్రిసత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సమ్మర్ క్యాంపు పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గతంలో ఉన్న 91 గురుకులాలకు అదనంగా మరో 94 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పిల్లలకు అన్ని రకాల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. దీంతో వాటిలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అక్కడ చదివిన విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యాసంస్థల్లో సీట్లు పొందుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది గురుకులాల్లో విధిగా వేసవి క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో క్యాంపులు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 45 చోట్ల క్యాంపులనిర్వాహణకు కసరత్తు జరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో 100 మంది గిరిజన, వందమంది సాంఘిక సంక్షేమ విద్యార్థులు పాల్గొంటారన్నారని తెలిపారు. ఈ నెల 22న ప్రారంభమై వచ్చే నెల ఆరో తారీకు వరకు అవి కొనసాగనున్నట్టు తెలిపారు. సంగీతం, నాట్యం ,పెయింటింగ్, రేఖా చిత్రం ,చిత్రలేఖనం, భాషా నైపుణ్యాలు, వాయిద్యాలు, కోడింగ్, డ్రోన్ తయారు చేయుట, క్రికెట్ కామెంట్రీ, వ్యక్తిత్వ వికాసం, బొమ్మల తయారీ ,ఆర్టిఫిషియల్ నగల తయారీ( జ్యువెలరీ మేకింగ్) వంటి అంశాల్లో మెళుకువలు నేర్పిస్తారని తెలిపారు. క్రీడలు కూడా సమ్మర్ క్యాంప్‌లో భాగమేనన్నారు. చెస్, క్రికెట్ ,బాస్కెట్‌బాల్ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 15 కేంద్రాల్లో జరిగే క్రీడల వేసవి క్యాంప్‌లు ఈ నెల 26న ప్రారంభమవుతాయనీ, ప్రతి క్యాంప్‌లో 30 మంది విద్యార్థులు లబ్ధి ఉంటారని తెలిపారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారని చెప్పారు.