Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు డీజీపీ పిలుపు
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి :
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీసు స్టేషన్ల అవార్డులను దక్కించుకోవడానికి రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లు పోటీ పడాలనీ, అందుకు అవసరమైన ప్రణాళికతో ముందడుగు వేయాలని, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో పాటు గతంలో కేంద్ర హౌం శాఖ నుంచి జాతీయ స్థాయి అవార్డులను పొందిన పోలీసు స్టేషన్ల ఇన్స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో కేంద్ర హౌం శాఖ ఇవ్వనున్న జాతీయ స్థాయి పోలీసు స్టేషన్ల అవార్డులను కైవసం చేసుకోవడానికి ఈ నాలుగు నెలల్లో ప్రణాళిక బద్ధంగా సిద్ధం కావాలని ఆయన కోరారు. ముఖ్యంగా, క్రైమ్ కంట్రోల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్ (సీసీఎన్టీఎస్)లో 80 శాతం మార్పులను, పోలీసు స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక ప్రజలతో సత్సంబంధాలు, నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడటం వంటి అంశాలలో మరో 20 మార్కులను ఈ అవార్డు కోసం ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా, మహిళలపై నేరాలను అదుపు చేయడం, గుర్తు తెలియని మృత దేహాల వెనుక ఉన్న మిస్టరీని కనుక్కోవడం, దర్యాప్తు జరిపిన కేసులపై సకాలంలో కోర్టులలో చార్జీషీట్లు వేయడం, నేరస్థులకు శిక్షలను సారించడంలో మంచి ఫలితాలను సాధించడంలో పైన కూడా ప్రత్యేకంగా ఎస్హెచ్ఓలు దృష్టిని సారించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 30 పోలీసు స్టేషన్లను జాతీయ స్థాయి అవార్డుల సాధన కోసం జాబితాను రూపొందించడం జరిగిందనీ, అయితే, ఈ అవార్డుల కోసం రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేసన్లు కూడా పోటీ పడాలని ఆయన చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా తాను కరీంనగర్ కమిషనర్ పని చేస్తున్నపుడు చొప్పదండి, జమ్మికుంట పోలీసు స్టేషన్లకు జాతీయ స్థాయి అవార్డులను సాధించడం జరిగిందనీ, అందుకు తాను అనుసరించిన మార్గాలను ప్రస్తుత డీజీపీ కార్యాలయంలో పర్సనల్ ఐజీగా ఉన్న కమలాసన్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అవార్డులను ఏ విధంగా సాధించాలనే విషయమై ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ను ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.