Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్‌రావుకు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం వినతి
- మంజూరు చేయాలంటూ అధికారులకు ఆర్థిక మంత్రి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జనవరి, ఫిబ్రవరి పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఆన్లైన్ ద్వారా మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ వినతిపత్రం పంపించారు. జనవరి, ఫిబ్రవరికి సంబంధించి జిల్లా కోశాధికారి నుంచి టోకెన్ నెంబర్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం వద్ద తమ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలకు నెలవారి చెల్లింపులు సక్రమంగా ఇవ్వకపోతే అధిక వడ్డీలు పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకున్నారని తెలిపారు. టోకెన్ నెంబర్లు వచ్చిన వారికి వెంటనే వేతనాలను మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. మార్చి వేతనాలు కూడా విడుదల చేయాలని మంత్రిని ఈ సందర్భంగా నేతలు కోరారు.
మౌన ఆవేదన కార్యక్రమం విజయవంతం
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం ఇంటర్ మూల్యాంకన కేంద్రాల వద్ద కాంట్రాక్టు అధ్యాపకుల మౌన ఆవేదన కార్యక్రమం ఐదోరోజు మంగళవారం విజయవంతమైందని టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చిత్రపటంతో రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకన కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామంటూ ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో పొందుపర్చారని గుర్తు చేశారు. దాంతో 22 ఏండ్ల వెట్టిచాకిరికి విముక్తి కలుగుతుందంటూ తాము సంతోషించామని వివరించారు. అయితే ఇప్పటికీ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు రాకపోవడంతో తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని క్రమబద్ధీకణ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.