Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌కు జీఎమ్‌పీఎస్ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేపట్టాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎమ్‌పీఎస్) రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ రాంచందర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయనకు సంఘం తరఫున వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీఎమ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా ఇప్పటికి నాలుగు లక్షల గొర్రెల పంపిణీ జరిగిందనీ, రెండో విడతలో మరో 3,72,020 మందికి గొర్రెలు రావల్సి ఉందని తెలిపారు. పంపిణీ సందర్భంగా యూనిట్లలో అక్రమాలు జరిగి, మధ్య దళారులు, కొందరు పశువైద్య అధికారులు లాభపడ్డారని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఈ సారి నేరుగా నగదు బదిలీ ద్వారా గొల్ల కురుమలు ఇష్టమొచ్చినచోట గొర్రెలు కొనుగోలు చేసుకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో అక్కడి గొల్ల కురుమల అక్కౌంట్లలోకి నగదు బదిలీ చేశారని గుర్తుచేశారు.
కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ల నుంచి కాకుండా, సొసైటీ అధ్యక్షుల సంతకాలతో తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడే పశువైద్యాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలేతప్ప, పూర్తిగా వారిని ఈ కమిటీలకు దూరంగా ఉంచడం సరికాదనీ, దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని వివరించారు. కార్యక్రమంలో జీఎమ్‌పీఎస్ రాష్ట్ర సహాక కార్యదర్శి అమీర్‌పేట మల్లేష్, రాష్ట్ర నాయకులు ఎక్కలదేవి కొమురయ్య, తుమ్మేటి బాలకృష్ణ, జిల్లెల పెంటయ్య, జోగు అనిల్ తదితరులు పాల్గొన్నారు.