Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు టిప్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను ఈనెల ఒకటో తేదీ నుంచి క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త ఎం జంగయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, కోకన్వీనర్లు లక్ష్మయ్య, మంజునాయక్, బీక్యా నాయక్, గోపాల్ నాయక్, శోభన్‌బాబు, మనోహర్, రహీం లేఖ రాశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల వెట్టిచాకిరి మానసిక వేదనను, బాధలను గమనించిన సీఎం కేసీఆర్ వారి న్యాయమైన డిమాండ్‌పై సానుకూలంగా స్పందించారని తెలిపారు. వారిని క్రమబద్ధీకరిస్తామంటూ 2016లో జీవో నెంబర్ 16ను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఆ జీవోను సవాల్ చేస్తూ ఉన్నతన్యాయస్థానాలను ఆశ్రయించడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. 2021, డిసెంబర్లో సుప్రీంకోర్టులో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సానుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. దాంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరణ కోసం పనుల వేగం పెంచి ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్రమబద్ధీకరిస్తామంటూ ప్రకటించారని పేర్కొన్నారు. అయినప్పటికీ అనుకోకుండా వచ్చిన ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియ జరగలేదని తెలిపారు. కానీ నేటి వరకు వారిని క్రమబద్ధీకరిం చకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈనెల ఒకటో తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపి మానసిక ప్రశాంతత కల్పించాలని సూచించారు.