Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ బుక్ హౌస్లో ప్రదర్శన ప్రారంభోత్సవంలో జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాజిక ఉద్యమనేతలు మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితర సామాజిక ఉద్యమనేతల జీవితాలను, వారి రచనలను చదవాలని సీపీఐ (ఎం) కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్లో పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాట నుంచి మనువాద వ్యతిరేకులను అణచివేయాలని చూస్తున్నదని విమర్శించారు. అందరికి సమాన విద్య అందాలనీ, శూద్రులు, మహిళలకు అన్నింటిలో సమాన అవకాశాలు రావాలనీ, కుల వివక్ష రూపుమాపబడాలని ఫూలే దంపతులు, అంబేద్కర్ పోరాడారని గుర్తుచేశారు. వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇందుకోసం స్ఫూర్తినిచ్చే వారి జీవితాలు, రచనలు నేటితరం, విద్యార్థులు పెద్ద ఎత్తున చదవాలని కోరారు. సమాజంలో మతోన్మాదం, కుల ఉన్మాదం, మనువాదాన్ని వ్యతిరేకించి జీవించడం కోసం ఇలాంటి పఠనం తోడ్పాటునందిస్తుందని సూచించారు.
బీజేపీ కులవ్యవస్థను, అసమానతలను పెంచి పోషిస్తోందనీ, ఆధిపత్య కులాల ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్నదని అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ నవతెలంగాణ బుక్ హౌస్ సామాజిక ఉద్యమ నేతల ఆలోచనా విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ కిష్టారెడ్డి, సిబ్బంది రఘు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.