Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలకుల నియామకం
- ముగిసిన టెన్త్ ప్రధాన పరీక్షలు
- సోషల్ స్టడీస్‌కు99.63 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ప్రధాన పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈనెల మూడో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారంతో పరీక్షలన్నీ పూర్తవుతాయి. మొదటి రోజే ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే అంటే ఉదయం 9.37 గంటలకు ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో బయటకొచ్చింది. రెండోరోజు హిందీ ప్రశ్నాపత్రం కూడా వాట్సాప్ ద్వారా బయటకొచ్చింది. ప్రశ్నాపత్రాలు బయటికి రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్ష నుంచి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం ప్రక్రియ సాగుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 మూల్యాంకన కేంద్రాలున్నాయని వివరించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు విద్యాశాఖ అధికారులను మూల్యాంకన కేంద్రాలకు పరిశీలకులుగా నియమించామని పేర్కొన్నారు. హైదరాబాద్, సంగారెడ్డికి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరికి తెలంగాణ గురుకుల కార్యదర్శి, మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్ రమణకుమార్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరికి వయోజన విద్య సంచాలకులు జి ఉషారాణి, వరంగల్‌కు సైట్ డైరెక్టర్ ఎస్ విజయలక్ష్మి బాయి, ఖమ్మంకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి, కరీంనగర్, సిద్ధిపేటకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డిప్యూటీ డైరెక్టర్ ఎం సోమిరెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్‌కు వరంగల్ ఆర్జేడీ కె సత్యనారాయణరెడ్డి, నిజామాబాద్‌కు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ పి మదన్మోహన్, మంచిర్యాల, జగిత్యాలకు ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఏ ఉషారాణి, నాగర్‌కర్నూల్‌కు సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ బి వెంకటనర్సమ్మ, మహబూబ్‌నగర్‌కు హైదరాబాద్ ఆర్జేడీ ఈ విజయలక్ష్మిని పరిశీలకులుగా నియమించామని వివరించారు.
16 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు
సోషల్ స్టడీస్ పరీక్షకు 4,86,194 మంది దరఖాస్తు చేసుకుంటే, 4,84,384 (99.63 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.