Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక ఉద్యమాలకు సంఘీభావ నిధిని ఇవ్వాలనీ, కార్మికవర్గం చేస్తున్న పోరాటాలకు అండగా నిలవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ నెల ఆరో తేదీ నుంచి 14 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలను సీఐటీయూ నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రంగారెడ్డి జిల్లా, కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో రాష్ట్ర కార్యదర్శి భూపాల్, సంగారెడ్డి జిల్లా, భానూర్‌లో రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, వరంగల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు సామాజిక సంఘీభావ నిధిని వసూలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజ్యాంగాన్ని రక్షించుకొని సామాజిక న్యాయాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ సాగుతున్నదని చెప్పారు. కుల వివక్ష, అంటరానితనం, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడే సంఘాలను బలపర్చాలని కోరారు. సామాజికోద్యమాలకు ఆర్ధిక చేయూతనివ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 వరకు ఉద్యోగ, కార్మికుల నుంచి ఫండ్ క్యాంపెయిన్ చేస్తున్నామని చెప్పారు. తమ ఉద్యమాలకు సహకరించాలని ప్రజలను కోరారు.