Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంతో దూరంలో లేదు : అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వారి గుండెల్లో ఉంటుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నిస్తేజం తొలగిపోయి మరలా టీడీపీకి పూర్వ వైభవం రావడం ఎంతో దూరం లేదన్నారు. మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మిర్యాలగూడ, జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కాసాని వారినుద్దేశించి మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వాలు చేసిన అభివద్ధి, సంక్షేమ పథకాలను నేటికీ ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు సంక్షేమ పాలన అంటే ఇది అని చేసి చూపించిన ఘనత తెలుగుదేశందేనని చెప్పారు. నేటి ప్రభుత్వాలు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరును చూసిన ప్రజలు మాకు మళ్ళీ టీడీపీ పాలనలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇంటింటికి టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నపుడు పార్టీ నాయకులు విభేదాలను వీడి కలిసిపోవాలని జ్ఞానేశ్వర్ సూచించారు. భిన్నాభిప్రాయాలు ఎక్కడైనా సహజమేననీ, కానీ పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో ఐక్యత తప్పనిసరిగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి టి. జ్యోత్స్న, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు ఆరీఫ్, మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు కాసుల సత్యం, జడ రాములు యాదవ్, ధీరవత్ మాన్యా నాయక్, ముక్కెర అంజిబాబు, ఎండీ జహంగీర్ పాల్గొన్నారు.