Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- లక్ష్మణచాంద/దుగ్గొండి
ఎండ పెరగడం.. దానికి వడగాడ్పులు తోడవ్వడంతో కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. మంగళవారం నిర్మల్, వరంగల్ జిల్లాల్లో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వివరా లిలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ గ్రామంలో వడదెబ్బతో ఉపాధిహామీ కూలీ మృతిచెందాడు. తోటి కూలీలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు పడిగెల రవి(45) మంగళవారం ఎప్పటిలాగే ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. పని చేస్తుండగానే ఒక్కసారిగా కండ్లు తిరిగి కింద పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు నీళ్లు తాగించే ప్రయత్నం చేశారు. సొమ్మసిల్లిపోయిన రవి పని ప్రదేశంలోనే ప్రాణం విడిచాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
సంఘటన స్థలాన్ని ఏపీఓ ప్రమీల, టీఏ దినేష్ పరిశీలించారు. మృతునికి భార్య రామణితో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం స్వామిదావుపల్లి గ్రామానికి చెందిన దుగ్గొండి ముప్పారపు సారయ్య (67) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిరపతోటలో పనికి వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో పక్కనే ఉన్న వేపచెట్టు కింద కూర్చున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. నిరుపేద అయిన సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.