Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సమస్యల్ని పరిష్కరించాలి
- లేకుంటే 17నుంచి సమ్మెలోకి : పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్షేత్రస్థాయిలో రోజంతా కష్టపడి పనిచేస్తున్న ఐకేపీ వీఓఏలకు రూ.3900 వేతనమే ఇవ్వటం దారుణమనీ, వారిచ్చే సమాచారం ఆధారంగా పనిచేసేవారికి లక్షల జీతం ఇవ్వడం రాష్ట్ర సర్కారుకు ఎంతవరకు సబబు అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో అంత తక్కువ వేతనంతో ఎలా బతుకాలో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. 20 ఏండ్ల నుంచి గొడ్డుచాకిరీ చేస్తున్న ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మహిళలు స్వయం సహాయక సంఘాలు పెట్టుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగడంలో వీఓఏల పాత్ర కీలకమైనదన్నారు. ఒకరకంగా వారు పేదరిక నిర్మూలన కోసం తీవ్ర కృషి చేస్తున్నారని చెప్పారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఐన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్ మాట్లాడుతూ..20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా వారికి పాలకులు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో బహుషా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నది వీరే కావొచ్చన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో వారికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ మాట్లాడుతూ..గ్రామీణ పేదరిక నిర్మూలనలో 17,606 మంది వీఓఏలు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక వేతనాలు పెంచుతామన్న హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు. వారిని వెంటనే సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలనీ, అర్హులైన వారికి సీసీలు, ఏపీఎమ్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. స్త్రీనిధి ఇన్సెంటీవ్ పెంచి వీఓఏలకు ఇవ్వాలని విన్నవించారు. ఐడీకార్డులివ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ, రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వీఓఏలు మార్చి 21 నుంచి ఆన్లైన్ పనులను నిలిపేశారన్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం చలనం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు సుధాకర్, శ్రీకాంత్, సోమన్న, ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్, ఎం.నగేశ్, ఉపాధ్యక్షులు వి.సుధాకర్, కోశాధికారి సుమలత, ఉపాధ్యక్షులు వసియాబేగం, రాష్ట్ర కార్యదర్శులు వెంకటయ్య, రమేశ్, శోభ, తదితరులు పాల్గొన్నారు.