Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.60 వేల కోట్ల మేర నిధులాపిన మోడీ
- రైతుల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తం
- ఉపాధి పని దినాలు తగ్గించి పేదలపై కుట్ర
- మీటర్లు పెట్టబోమంటూ జెడ్పీ ఏకగ్రీవ తీర్మానం
- సంగారెడ్డి జెడ్పీ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదన్న నెపంతో రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్ల నిధుల్ని కేంద్రం ఆపిందని, అయినా రైతుల కోసం ఎన్ని కష్టాలైనా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జెడ్పీ సమావేశానికి హాజరయిన మంత్రి హరీశ్.. ముందుగా జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సంస్కరణల పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్‌ను ఎత్తివేయాలని ఒత్తిడి చేసిందన్నారు. నిధులివ్వకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా సీఎం కేసీఆర్ రైతుల కోసం యూనిట్‌కు రూ.20 ఖర్చు చేసి అయినా ఉచిత కరెంట్‌ను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ యాసంగీ సీజన్ పంటలు ఎండకుండా ఉండేందుకు విద్యుత్ కొనుగోలు కోసం రూ.15 వేల కోట్ల అదనపు భారాన్ని రాష్ట్రం భరిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినందుకు బీఆర్ఎస్పై కక్షకట్టి రాష్ట్రానికి రావాల్సిన బీఆర్జీఎఫ్ నిధులు రూ.1350 కోట్లు, మిషన్ భగీరథకు నిటి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ.13 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రావాల్సిన రూ.12 వేల కోట్లు, రైతులకు కల్లాలు కట్టిన డబ్బులు ఇలా సుమారు రూ.60 వేల కోట్ల వరకు నిధుల్ని ఇవ్వట్లేదన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్, రైతు బంధు, ఎరువుల సరఫరా, రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయడం వల్ల తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. ఏటా రైతులు పండించే ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేసి రూ.26 వేల కోట్లు ఖాతాలో వేస్తుందని తెలిపారు. కేంద్రం ఉపాధి హామీ చట్టంలో కూలీలకు పని దినాల్ని తగ్గించి, పని గంటలు పెంచిందని, అయినా వేతనం మాత్రం పెంచలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగినందున ఉపాధి కూలీలతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే పని చేయించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలంటే ప్రజలకు భరోసా కల్పించే విధంగా వైద్య సేవల్ని మెరుగుపర్చామన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళలకు అవగహన కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లకు 200 కొత్త వాహనాల్ని సమకూర్చుతున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆస్పత్రుల్లో బెడ్లు పెంచామన్నారు. గర్భిణుల కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో టిపా స్కాన్, నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ సెంటర్ పెట్టామని తెలిపారు. త్వరలోనే ప్రతి నర్సు పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు. అనంతరం బస్తీ దవాఖానాను ప్రారంభించారు. కాగా, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.30వేల కొట్ల నిధుల్ని వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చంటిక్రాంతికిరణ్, మాణిక్యరావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్, కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు.