Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యశోదకు రూ. 100 కోట్లకే రూ. 800 కోట్ల భూమి
- అందులో కేటీఆర్ కమీషన్ 20 శాతం
- ఎకరాకు 5 లక్షల చదరపు గజాల్లో నిర్మాణాలకు అనుమతి
- ఆరోపణలు తప్పని నిరూపించాలని కేటీఆర్‌కు రేవంత్ సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భూకేటాయింపులు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. కోట్ల రూపాయలను దోపీడీ చేస్తున్న వైనంలో భాగంగా నిన్న హెటిరో పార్థసారధి రెడ్డి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన రేవంత్... యశోద సంస్థకు భూముల కట్టబెట్టడం వెనుక జరిగిన కుట్రను బయటపెట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, జగదీశ్వర్‌రావు, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. హైటెక్ సిటీ సమీపంలో రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్లకే యశోద ఆస్పత్రి యాజమాన్యాకి కేటాయించినట్లు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధనలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలం, ఖానాపూర్ గ్రామం సర్వే నెంబర్ 41/14లో ఐదు ఎకరాల స్థలాన్ని, ఎకరా రూ.10 కోట్ల చొప్పున ధర నిర్ణయించి కేటాయిస్తూ సేల్ డీడ్ చేసుకుందని గుర్తు చేశారు. జీవో నెంబర్ 1484, లోకాయుక్త అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అక్కడ ఎకర ధర రూ. 10 కోట్లు కాదు...రూ.12 కోట్లు ఉందని నిర్ధారణ కావడంతో ఈ మేరకు ఆ సర్వే నెంబర్లో స్థలం పొందిన అలగ్జాండ్రియాతో పాటు మారుతి సుజుకీ కంపెనీలకు 5.6.2012న హెచ్ఎండీఏ లేఖ రాసిందన్నారు. సదరు సర్వే నెంబర్లో ఎకర రూ.12 కోట్లు ధర పలుకుతున్నందున ముందుగా చెల్లించిన మొత్తానికి అదనంగా... ఎకరానికి రూ.2 కోట్లు చెల్లించాలని ఆ లేఖలో పేర్కొందని గుర్తు చేశారు. ఈ లేఖపై స్పందించిన మారుతి సుజుకీ తనకు కేటాయించి రెండు ఎకరాల స్థలానికి అదనంగా చెల్లించాల్సిన రూ.4 కోట్లు చెల్లించిందని తెలిపారు. అలగ్జాండ్రియా మాత్రం ఈ అంశంపై కోర్టుకు వెళ్లిందని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖానామెట్ గ్రామంలో సర్వే నెంబర్ 41/14లో ఉన్న భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడిందని ఆరోపించారు. అప్పటికే అలగ్జాండ్రియాకు కేటాయించిన భూమి ధర వివాదం కోర్టులో ఉండటంతో దానిని సాకుగా చూపి అలగ్జాండ్రియాను బెదిరించి 2016లో అలగ్జాండ్రియా కంపెనీలోకి కల్వకుంట్ల జగన్నాథరావు, గోరుకంటి రవీందర్రావు, గోరుకంటి దేవేందర్ రావు డైరెక్టర్లుగా చొరబడ్డారని వివరించారు. జగన్నాథరావుకు కల్వకుంట్ల అనే ఇంటి పేరు తప్ప ఎటువంటి అర్హత లేదని ఎద్దేవా చేశారు. ఆ విధంగా అలగ్జాండ్రియా అనే కంపెనీ కల్వకుంట్ల మాఫియా సొంతమైందని చెప్పారు. ఆ తర్వాత కోర్టులో ఉద్ధేశపూర్వకంగానే కేసు ఓడిపోయి తన మాఫియా సభ్యులుగా ఉన్న డైరెక్టర్లకు రూ.500 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేసిందన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఖజానాకు అదనంగా రావాల్సిన రూ.10 కోట్లు రాలేదనీ, రూ.500 కోట్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి వారికి దక్కిందన్నారు. అర్హత లేకపోయినా వారికి కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాస్తవానికి హైటెక్ సిటీ సమీపంలో ఉన్న ఈ భూమి ధర 2017లో గజానికి రూ. రెండు లక్షలకు తక్కువ లేదన్నారు. యశోద గ్రూప్ గజం రూ.37,611కు కొనుగోలు చేసిందన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ.33.70 కోట్లు ఉందని తెలిపారు. ఈ భూదోపిడీలో అలగ్జాండ్రియాలో రూ.500 కోట్లు, యశోద గ్రూప్‌కు రూ.300 కోట్ల విలువైన భూములను కేవలం రూ 100 కోట్లకే కట్టబెట్టిందన్నారు. నిరుద్యోగ కుటుంబానికో లక్ష రూపాయలు సాయం చేయాలని కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదన్నారు. ఆ భూములను అమ్మితే రూ.2500 కోట్లు వస్తాయనీ, ఆ సొమ్ముతో నిరుద్యోగులను ఆదుకోవచ్చు అని తెలిపారు. అత్యంత కీలకమైన లిక్కర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు కేటాయించిన భూముల వివరాలను, వారి బంధాన్ని బుధవారం బయటపెడతానని వెల్లడించారు. తాను ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.