Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎంత ప్రమాదమో ప్రజలకు తెలియజెప్పాలి :
జయంతి సభలో సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు చాడ, చెరుపల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జోతిబా ఫూలే స్ఫూర్తితో మనువాదంపై బలమైన ఉద్యమం నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్-బీజేపీ అనుసరిస్తున్న సిద్ధాంతం ఎంత ప్రమాదకరమనే అంశాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని కోరారు. సమాజాన్ని మార్చేందుకు ఉద్యమాలను ముందుకు తీసుకుపోవ డమే ఫూలేకు ఇచ్చే నిజమైన నివాళి అని వారు అన్నారు. మహాత్మా జోతిబాఫూలే 197వ జయంతి సందర్భంగా 'మనువాదాన్ని మట్టుపెడదాం- సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం'అనే అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ ఆరోజుల్లో మనువాద భావజాలం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ఫూలే... ఆ దుర్మార్గాలు, పీడన, అణచివేత, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. సమాజ మార్పు కోసం కృషి చేశారని వివరించారు. నాడు దేశంలో కులాలు, మతాలు, మూఢ నమ్మకాలు విపరీతంగా ఉన్నాయని, స్త్రీలకు స్వేచ్ఛ లేదని, సమానత్వం లేదని గుర్తు చేశారు. ఈ దురాచారాలకు మూలమైన మనువాదం, వేదాలను ఫూలే అధ్యయనం చేశారని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారని అన్నారు. అందరికీ చదువు ఉండాలని, స్త్రీలకు సమాన హక్కులుండాలని ఉద్యమించారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఇప్పటికీ దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు. ప్రధాని మోడీని విమర్శిస్తే బీసీలను, దేశాన్ని విమర్శించినట్టుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అదానీ అక్రమాలను ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టుగా బీజేపీ నాయకులు అంటున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం, మనువాదం ప్రకారం మోడీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ మనుస్మృతిని ఆనాడే అంబేద్కర్ తగులబెట్టారని గుర్తు చేశారు. సంఫ్‌ుపరివార్ శక్తులు తెలివిగా మనువాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తునిగా ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజు గాడ్సే చిత్రపటాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రదర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. మనువాదం, ఆర్ఎస్ఎస్-బీజేపీ సిద్ధాంతంపై లోతైన అధ్యయనం చేయాలని, సమాజ మార్పు కోసం బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. చాడ మాట్లాడుతూ దేశంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఉందన్నారు. ఆధునిక ప్రపంచంలోనూ గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మనిషిని మనిషిగా చూడని పరిస్థితులున్నాయని వివరించారు. అణగారిన వర్గాల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. 150 ఏండ్ల కింద సామాజిక న్యాయం కోసం ఫూలే పనిచేశారని గుర్తు చేశారు. 1873లో సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశారని, బడుగు, బలహీనవర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని వివరించారు. భారత్‌లో ఇంకా సామాజిక న్యాయం రాలేదన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుగుతున్నా అణచివేత, వివక్ష పోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో విషబీజాలను నాటాలని చూస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలను, హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టాలని కోరారు. ఫూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ అధ్యక్షత వహించగా, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్ వందన సమర్పణ చేశారు.