Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, ఉస్మానియా, పాలమూరు, జేఎన్టీయూహెచ్ తదితర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెంచిన పరీక్ష ఫీజులు, నాన్ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజులు, ప్రస్తుతం రాస్తున్న సెమిస్టర్ ఫీజులను తగ్గించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయాలు అదనపు ఆదాయం కోసం ప్రయివేటు విద్యాసంస్థల కంటే దారుణంగా ఫీజులు పెంచుతున్నాయని విమర్శించారు. సెమిస్టర్ ఫీజులు ఒక్కోసారి ఒక్కోలా పెంచుతూ ఫీజుల భారాన్ని విద్యార్థులపై రుద్దుతున్నారని తెలిపారు. కేయూ, ఓయూలో ఈ సంవత్సరం భారీగా ఫీజులను పెంచారని పేర్కొన్నారు. ఓయూలో పీహెచ్డీ ఫీజులు, కేయూలో బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులు, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఫీజులు పెంచారని వివరించారు. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మూలంగా ఆ భారాలను ఫీజులను పెంచి విద్యార్థులపై మోపుతున్నారని తెలిపారు. ట్యూషన్ ఫీజులు ప్రభుత్వం ఇవ్వకుంటే వాటిని కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కేయూ నాన్ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫీజుల ద్వారా రూ.67 కోట్లు వసూళ్లు చేసిందని వివరించారు. ఓయూ కూడా ఇలాగే వసూళ్లు చేసిందని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పెంచిన అన్ని రకాల ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే విశ్వవిద్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.