Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టాలి :యూఎస్పీసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవిలోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టటానికి విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను బుధవారం యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు. బదిలీలపై హైకోర్టులో నడుస్తున్న కేసు జూన్ 13వ తేదీకి వాయిదా పడటం విచారకరమని తెలిపింది. కేసు వాయిదాను (ఈ నెలాఖరులోగా) ముందుకు జరిపే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేయాలని సూచించింది. తద్వారా వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు జరిగేటందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు అయినా కల్పించాలని కోరింది. ఎనిమిదేండ్లుగా పదోన్నతుల్లేక అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఖాళీల వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతున్నదని తెలిపింది. పదోన్నతులు ఇస్తేనే నియామకాల ఖాళీలపై స్పష్టత వస్తుందని పేర్కొంది. వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి ప్రత్యక్ష నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది.