Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్‌పీబీ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వివిధ నేరాలకు సంబంధించి నేరస్థులను గుర్తించి పట్టుకోవడానికి పోలీసు వేలి ముద్రల విభాగం (ఎఫ్‌పీబీ) అత్యంత కీలకమైందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా బుధవారం అన్ని జిల్లాలకు చెందిన ఫింగర్‌ప్రింట్స్ బ్యూరో అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, తదిత నేరాలు జరిగిన సమయంలో ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం సేకరించే నేరస్థులకు సంబంధించిన వేలి ముద్రలు దర్యాప్తునకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా, వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకోవడం, ఇదే వేలి ముద్రల ఆధారంగా కోర్టులలో నేరస్థులకు శిక్షలను సారించడం చాలా కేసుల్లో సులువవుతున్నదని అంజనీ కుమార్ తెలిపారు. అంతర్రాష్ట్రాలకు చెందిన నేరస్థుల వేలి ముద్రలను సేకరించి భద్రపర్చడం వలన నేరాలు జరిపి పారిపోయినవారు దేశంలో ఎక్కడున్నా గుర్తించడానికి వీలవుతున్నదని అన్నారు. త్వరలోనే మరో ఆరు కొత్త క్లూస్ టీంలను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. దర్యాప్తు అధికారులకు నేర పరిశోధనలో ఎఫ్‌పీబీ గుండెకాయగా మారుతున్నదని ప్రశంసించారు. ప్రతి ఏటా ఐదు అత్యుత్తమ ఫింగర్ ప్రింట్ బ్యూరోలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.