Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కోర్టు నిర్ణయం
నవతెలంగాణ - ప్రత్యేకప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ కేసులో దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇద్దరు నిందితులను విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని బుధవారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లను విచారించడానికి ఈడీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వీరి కస్టడీపై నిర్ణయాన్ని గురువారానికి కోర్టు వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డికి ప్రవీణ్ పీఏ కాగా.. రాజశేఖర్ కంప్యూటర్ సర్వీసుల నిర్వహణకు ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వీరిద్దరినిప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న నగర సిట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఇదిలా ఉంటే, ఇదే కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌కు ఇంచార్జీగా ఉన్న శంకరలక్ష్మితో పాటు ఇదే శాఖలోని అడ్మిన్ సూపరింటెండెంట్ సత్యనారాయణలు కూడా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ జరిపిన దర్యాప్తు అంశాలకు సంబంధించిన పత్రాలను తమకు సమర్పించాలని ఈడీ కోర్టును కోరింది. కాగా టీఎస్పీఎస్సీకి చెందిన పరీక్షలను విదేశాల నుంచి వచ్చిన కొందరు అభ్యర్థులు కూడా రాశారని, జరిగిన పేపర్ లీక్‌కు సంబంధించి వారు కూడా భారీ మొత్తంలో ముడుపులు చెల్లించారని, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ అధికారులు దృష్టిని సారించి దర్యాప్తును జరుపుతున్నారు.