Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ డిమాండ్
న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ చరిత్ర సిలబస్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) కేంద్ర వర్కింగ్ కమిటీ ఖండించింది. ఈ మేరకు ఏఐ ఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయ రాఘవన్, బి.వెంకట్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో పాఠ్యాంశాల తొలగింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'కింగ్స్ అండ్ క్రానికల్స్'కు సంబంధించిన అధ్యాయాలు, అంశాలు మొఘల్ కోర్టులు, 2002 గుజరాత్ అల్లర్లు, కుల వ్యవస్థకు సంబంధించిన అన్ని సూచనలు, నిరసనలు, సామాజిక ఉద్యమాలపై అధ్యాయాలు, మహాత్మా గాంధీని హిందూ తీవ్రవాది గాడ్సే హత్య చేయడం, గాంధీ హత్య తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్)పై విధించిన నిషేధం వంటి ప్రస్తావనలు తొలగించారని తెలిపారు. పదో తరగతికి సంబంధించి నవీకరించబడిన ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలు 'డెమోక్రటిక్ పాలిటిక్స్' పాఠ్యపుస్తకం నుంచి 'ప్రజాస్వామ్యం, వైవిధ్యం,' 'ప్రజా పోరాటాలు, ఉద్యమం,' 'ప్రజాస్వామ్యానికి సవాళ్లు' అనే అధ్యాయాలను తొలగించారని అన్నారు. ఇది హిందూ రాష్ట్రానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ఆలోచనను ప్రోత్సహించడానికి, దేశ బహువచన చరిత్రను తుడిచివేయడానికి చేసిన ప్రయత్నమని విమర్శించారు. ఈ మార్పులతో దేశ చరిత్రలో తమ నేరాలను చెరిపివేయాలని కోరుకుంటోందని ఆరోపించారు. హిందుత్వ శక్తులు పాఠ్యపుస్తకాల నుంచి కులం గురించిన అంశాలను తొలగించడంతో కులం పట్ల తమ నిజమైన విధానాన్ని దాచలేరని పేర్కొన్నారు. ఇది చాలా ఆందోళనకరమైనదనీ, రాజ్యాంగంలో ఊహించిన ప్రజాస్వామ్య, లౌకిక దేశాన్ని విశ్వసించే సమాజంలోని అన్ని వర్గాలు ప్రతిఘటించాలని పిలుపు ఇచ్చారు.
విద్య నిజమైన ఉద్దేశ్యం నిష్పాక్షిక దక్పథాన్ని అందించడం, దేశంలోని మొఘలులు, ఇతర మైనారిటీల చరిత్ర లేకుండా మన చరిత్ర అసంపూర్ణమని పేర్కొన్నారు. ఈ వాస్తవాలు ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఎప్పటికీ వ్యతిరేకమనీ, అందు వల్ల యువ మనస్సుల నుంచి వాస్తవికతను దాచాలను కుంటున్నారని అన్నారు. ఈ మార్పులను రద్దు చేసి, పాత పాఠ్యపుస్తకాలను తిరిగి తీసుకురావాలని, అకడ మిక్ సమగ్రత, మేథో స్వేచ్ఛ సూత్రాలను సమర్థిం చేందుకు ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.