Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంకటయ్య భౌతికకాయానికి చాడ, సీపీఐ నాయకుల నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బొమ్మగాని కుటుంబం అంటేనే కమ్యూనిస్టు కుటుంబంగా మారిందని పలువురు వక్తలు అబిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని వెంకటయ్య ఆనాటి నైజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో ఆయన రెండో కుమారుని నివాసంలో వెంకటయ్య భౌతికకాయాన్ని ఉంచారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, పల్లా నరసింహారెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, సీపీఐ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్, ఐప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ బొమ్మగాని వెంకటయ్య పార్ధివ దేహంపైన 'ఎర్ర జెండా'ను కప్పి, పూలమాలతో నివాళులర్పించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిట్యునల్ మాజీ సభ్యులు, రిటైర్డ్ న్యాయమూర్తి ఎం కాంతయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నండూరి కరుణాకుమారి, పలువురు సీపీఐ నాయకులు నివాళులర్పించారు. అనంతరం బొమ్మగాని వెంకటయ్య భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన సూర్యాపేటకు తరలించారు.
నిరాడంబరుడు బొమ్మగాని వెంకటయ్య : చాడ
బొమ్మగాని వెంకటయ్య నిరాడంబరుడని, ప్రజల కష్టాలనుచూసి సహించలేక అనేక ఉద్యమాలు చేశారని, స్వయంగా దళంలో పాల్గొన్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన నిండు నూరెళ్లు బతికిన నిరాడంబరుడని, ఉక్కుమనిషి అని కొనియాడారు. ఆయన చిన్నప్పుడే ఎర్రజెండా పట్ల ఆకర్షితులై ఆనాటి నైజాం రాక్షస రాజ్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూస్వాములు, వెట్టి చాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా తన అన్న బొమ్మగాని ధర్మభిక్షంతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.