Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
- హైదరాబాద్‌లో ఎంబీ వర్ధంతి కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కమ్యూనిస్టు ఉద్యమానికి సైద్ధాంతిక యోధుడు మాకినేని బసవపున్నయ్య (ఎంబీ) అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. సీపీఐ(ఎం) మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంబీ 31వ వర్ధంతి కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాల్గొన్నారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి నిర్మించడంలో విశేష కృషి చేశారని అన్నారు. గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉండి వ్యవసాయ కార్మిక సంఘం, విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేశారని వివరించారు. ఆయన ఆస్తులను కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక ఆటుపోట్లు వచ్చినపుడు మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంతాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకనుగుణంగా ముందుకు తీసుకెళ్లడంలో సైద్ధాంతిక కృషి చేశారని చెప్పారు. సీపీఐ, సీపీఐ(ఎం) విడిపోయినప్పుడు, నక్సలైట్ల ఉద్యమం ఆవిర్భవించినప్పుడు, చైనాలో అతివాద పోకడలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ బసవపున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అంటే బాటలో నడిస్తేనే కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బూర్జువా పార్టీలు అధికారంలో ఉన్న చోట సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వం మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నదని చెప్పారు. రాష్ట్రంలో 50 కేంద్రాల్లో ఇండ్లు, ఇండ్ల స్థలాల పోరాటం సాగుతున్నదని వివరించారు. ఇంకోవైపు కనీస వేతనాల కోసం కార్మికుల్లో కదలిక వచ్చిందన్నారు. సంస్కరణవాద ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పారు. పార్లమెంటరీ తత్వంపై రాజీలేకుండా పోరాడకుండా, స్వీయ మానసిక ధోరణులకు వదిలించుకోకుండా కమ్యూనిస్టు ఉద్యమం ముందుకుపోదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాం నాయక్, ఎం శ్రీనివాస్, ఆర్ వెంకట్రాములు, జె బాబురావు, బుర్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.