Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెరచాటు ఒప్పందాలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయివేటీకరణ వ్యతిరేకతే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో, ఏపీలో వేర్వేరు స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టాలని ఉన్నట్టు గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐరన్ నిక్షేపాలు ఉన్నాయని గుర్తుచేశారు. కానీ అక్కడ ఐరన్ ఓర్ గనులు లేవంటూ కేంద్రం మళ్లీ అబద్ధాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైలడిల్ల నుండి ఐరన్ ఒర్ ఇస్తే ఇక్కడ ఉన్న గనులతో ఫ్యాక్టరీ పెట్టొచ్చని సూచించారు.
బయ్యారం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసి 1,800 కిలోమీటర్ల దూరంలో గుజరాత్లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఇదే విషయాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పినప్పటికీ దానిపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించడానికి సిద్దంగా ఉన్నదని కేటీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుంటే ఈ పాటికే సుమారు 20 వేల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు.
ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ఆదానీకి మేలు చేకూర్చేలా కేంద్రం చర్యలు ఉంటున్నాయని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకెళ్లాలని కోరారు.