Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఆశా యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆశావర్కర్లకు ఈ ఏడాది మార్చి నెల పెండింగ్ పారితోషికాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు బుధవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, ఆర్.నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెల ఒకటి లేదా రెండో తేదీకల్లా ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు చెల్లించేదనీ, మార్చి నెల పది రోజులు ఆలస్యం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అసలే చాలీచాలనీ పారితోషికాలు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, దీనికి తోడు ఆ పారితోషికాలు సకాలంలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆశావర్కర్లందరూ మహిళలు, అత్యధికులు బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారనీ, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.